కృష్ణయ్యకు ఇప్పుడు బీసీలు గుర్తొచ్చారా?

January 10, 2019


img

ఈబీసీ బిల్లును వ్యతిరేకిస్తూ బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్‌.కృష్ణయ్య అధ్వర్యంలో బుదవారం హైదరాబాద్‌లో బషీర్‌బాగ్‌లో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “అడగనివారికి, అవసరంలేనివారికీ 10 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. రాష్ట్రంలో అగ్రకులాలు 9 శాతం మాత్రమే ఉండగా వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం ఏవిధంగా సమర్ధించుకుంటారు. ముఖ్యమంత్రులు, గవర్నర్లు, న్యాయమూర్తులు, బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్లు ఈవిధంగా అన్ని కీలకపదవులలో అగ్రకులాలవారే ఉంటున్నారు తప్ప బీసీలకు అవకాశం కల్పించలేదు. మళ్ళీ వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించవలసిన అవసరం ఏమిటి?” అని ప్రశ్నించారు. 

ఈ రిజర్వేషన్లు అగ్రవర్ణాలతో సహా ఆర్ధికంగా వెనుకబడిన ముస్లింలు, క్రీస్టియన్లు తదితర అన్ని మతాలవారికీ వర్తిస్తాయని చెపుతున్నప్పుడు, ఇది కేవలం అగ్రవర్ణాలవారి కోసమేనని వాదిస్తూ కృష్ణయ్య అభ్యంతరాలు వ్యక్తం చేయడం సమంజసం కాదు. ఇది ప్రజలను తప్పు దారి పట్టించే ప్రయత్నమే అని చెప్పక తప్పదు. 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పెద్దపీటవేసిన బి.ఎల్.ఎఫ్.కు ఆర్.కృష్ణయ్య మద్దతు ఈయకుండా కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసి తన దారి తాను చూసుకున్నారు. కానీ ఓడిపోయారు కనుక మళ్ళీ ఇప్పుడు బీసీలు...వారి సంక్షేమం గురించి మాట్లాడుతూ దూరం అయిన తన వర్గం ప్రజలకు మళ్ళీ దగ్గరయ్యి, తద్వారా మళ్ళీ బీసీ సంఘాలపై తన పట్టును నిలుపుకొనేందుకే ఈవిదంగా హడావుడి చేస్తున్నట్లున్నారు.


Related Post