సీతారామ ప్రాజెక్టుకు కేంద్రం లైన్ క్లియర్

January 09, 2019


img


తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులకు ఎన్ని అవరోధాలు ఎదురైనప్పటికీ తెరాస ఎంపీలు, ప్రభుత్వం, ఉన్నతాధికారులు పట్టు వదలని విక్రమార్కుడిలాగ కేంద్రప్రభుత్వంపై నిరంతరం చేస్తున్న ఒత్తిడి కారణంగా ఒక్కో ప్రాజెక్టుకు అనుమతులు లభిస్తున్నాయి. గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు అన్ని అనుమతులు మంజూరు చేసిన కేంద్రప్రభుత్వం తాజాగా సీతారామ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు మంజూరు చేసింది. అంటే ఆ ప్రాజెక్టు నిర్మాణానికి ఎటువంటి అభ్యంతరాలు లేవని అంగీకరించినట్లే భావించవచ్చు. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ డైరెక్టర్ డాక్టర్ ఎస్ కర్కెట్ట ఇటీవలే ఒక లేఖ ద్వారా ఈ విషయం సీతారామ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ సుధాకర్‌కు తెలియజేశారు.

గతంలో ఉన్న ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్టులను రీడిజైనింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్మిస్తోంది.   భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలోని దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి నీటిని మళ్లించి మూడు జిల్లాలకు సాగు, త్రాగు నీరు అందజేయడానికి ఈ సీతారామ ప్రాజెక్టు నిర్మిస్తోంది ప్రభుత్వం. వచ్చే ఏడాది జూన్ నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. 

సీతారామ ఎత్తిపోతల పథకం పూర్తయితే ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, మహబూబాబాద్ మూడు జిల్లాలోని 6.74 లక్షల ఎకరాలకు సాగునీరు లభిస్తుంది. రూ. 13,384.80 కోట్ల వ్యయంతో చేపడుతున్న ఈ ఎత్తిపోతల పధకం ద్వారా కొత్తగా 3.28 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయి. మరో 3.45 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది.        ఆ మూడు జిల్లాలోని 180 గ్రామాలకు త్రాగునీరు లభిస్తుంది. 



Related Post