తెరాసది అతివిశ్వాసమా...ఎన్నికల వ్యూహమా?

January 08, 2019


img

తెలంగాణ భవన్‌లో నిన్న జరిగిన ఒక కార్యక్రమంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ పార్టీ కార్యకర్తలను, ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కేంద్రంలో అధికారంలోకి రావాలంటే కనీసం 273 ఎంపీ సీట్లు ఉండాలి. కానీ కాంగ్రెస్, బిజెపిల పరిస్థితి చూస్తే అవి అన్ని సీట్లు గెలుచుకునే అవకాశం కనబడటం లేదు. కనుక దేశాన్ని ఎవరు పరిపాలించాలో తెలంగాణ ప్రజలే నిర్ణయించగలరు.ఆ విధంగా జరగాలంటే మనం సిఎం కేసీఆర్‌కు 16 ఎంపీ సీట్లు గెలిచి ఇవ్వాలి,” అని అన్నారు.             

ప్రధాని నరేంద్రమోడీ పట్ల దేశప్రజలలో కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవం. కానీ అంతమాత్రన్న బిజెపి ఓడిపోతుందనే తెరాస వాదన అర్ధరహితం. ఆ లెక్కన సిఎం కేసీఆర్‌ వ్యవహారశైలి పట్ల కూడా రాష్ట్ర ప్రజలలో వ్యతిరేకత ఉంది కానీ ఓడిపోలేదు కదా? 

గత నాలుగేళ్ళలో కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని ఏవిధంగా అభివృద్ధి చేశారో, ఎన్ని సంక్షేమ పధకాలు అమలుచేశారో అదేవిధంగా ప్రధాని నరేంద్రమోడీ కూడా దేశవ్యాప్తంగా అనేకానేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు. “తెలంగాణలో సాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోకుండా యధాతధంగా కొనసాగాలంటే మళ్ళీ కేసీఆర్‌నే ముఖ్యమంత్రిని చేయాలి. కారు జోరు తగ్గకూడదు డ్రైవరు మారకూడదు” అంటూ తెరాస ప్రచారం చేసుకొంది. ప్రధాని నరేంద్రమోడీకి కూడా ఇదే వర్తిస్తుంది. 

నిజం చెప్పాలంటే రాష్ట్రాలలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పధకాలకు ప్రధాని నరేంద్రమోడీ చొరవ, దూరదృష్టి కారణంగానే భారీగా నిధులు విడుదలవుతున్నాయి. కానీ ఈ అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించి తెరాసలాగా బిజెపి నేతలు గట్టిగా, సమర్ధంగా ప్రచారం చేసుకోకుండా తీవ్ర అలసత్వం, నిర్లక్ష్యం చూపుతున్నందునే కేంద్రం చేస్తున్న ఈ మంచి పనులన్నిటినీ తెరాస, టిడిపి వంటి ప్రాంతీయపార్టీలు తమ పద్దులో రాసుకొని రాజకీయ ప్రయోజనం పొందగలుగుతున్నాయి. అయితే దేశప్రజలకు ఇవన్నీ తెలుసు కనుక లోక్‌సభ ఎన్నికలలో మోడీని, బిజెపిని తిరస్కరిస్తారనుకోలేము. 

2014 ఎన్నికలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు చాలా సానుకూల వాతావరణం కనిపిస్తోంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో మూడు బిజెపి పాలిత రాష్ట్రాలను చేజిక్కించుకొంది. చంద్రబాబునాయుడు వంటి ఆగర్బ శత్రువు, కారణాలు ఏవైతేనేమీ...కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి దానికి ప్రాంతీయపార్టీల మద్దతు కూడగట్టేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. జెడిఎస్, టిడిపి, డిఎంకె వంటి పార్టీలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని అంగీకరించి కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడేందుకు ముందుకు వస్తున్నాయి. 

కనుక తెలంగాణ ప్రజలలో కేసీఆర్‌ పట్ల ఉన్న వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ ఏవిదంగా సొమ్ము చేసుకొని అధికారంలోకి రావాలని ప్రయత్నించిందో అదేవిధంగా ప్రధాని నరేంద్రమోడీ పట్ల దేశప్రజలలో ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకొని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతోంది. 

రెండు జాతీయ పార్టీలకు ఇంత అనుకూల వాతావరణం కనిపిస్తుంటే, అవి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజార్టీ సాధించలేవని, కానీ తెరాసకు కేవలం 16 ఎంపీ సీట్లు ఇస్తే డిల్లీలో చక్రం తిప్పుతుందనే దాని వాదన అర్ధరహితం. 2014 ఎన్నికల సమయంలో జోరుగా రాష్ట్ర విభజన ప్రక్రియ జరిగిపోతున్నప్పుడు దానిని తీవ్రంగా వ్యతిరేకించినట్లు నటించిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఇదేవిధంగా వాదించిన సంగతి ప్రజలకు గుర్తుండే ఉంటుంది. కనుక తెరాస 16 ఎంపీ సీట్లు గెలుచుకునేందుకే ఈ వితండవాదనను తెరపైకి తీసుకువచ్చిందని చెప్పక తప్పదు.


Related Post