చంద్రబాబు ఫ్రంట్ ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు?

January 07, 2019


img

రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసిఆర్, చంద్రబాబునాయుడు ఇంచు మించు ఒకేసమయంలో జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేశ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు కోసం కేసిఆర్, మోడీని గద్దె దించాలని చంద్రబాబునాయుడు కూటమిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొంటున్నారు. కానీ నిజంగానే అవే కారణాలు, ఆశయంతో వారు కూటమిని ఏర్పాటు చేస్తున్నారా? లేక వేరేమైనా కారణాలు, ఆలోచనలు ఉన్నాయా? అని ఆలోచిస్తే వేరేవి కనిపిస్తాయి.       

చంద్రబాబునాయుడు ఏర్పాటుకు అనేక బలమైన కారణాలు కనిపిస్తున్నాయి. 

1. రాష్ట్రంలో మళ్ళీ టిడిపి అధికారంలోకి వస్తేనే నారా లోకేశ్ ఎప్పటికైనా ముఖ్యమంత్రి కాగలరు. లేకుంటే అతని రాజకీయ భవిష్యత్ అంధకారంగా మారుతుంది. కానీ రాష్ట్రంలో చంద్రబాబుకు, ఆయన ప్రభుత్వానికి వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పక్కలో బల్లెంలా తయారైయ్యారు. టిడిపిపై అవినీతి ఆరోపణలున్నాయి. వచ్చే ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో వైకాపా అధికారంలోకి వస్తే చంద్రబాబునాయుడు, నారా లోకేశ్ లతో సహా టిడిపి నేతలందరిపై సమగ్ర విచారణ చేయిస్తానని జగన్మోహన్ రెడ్డి హెచ్చరిస్తున్నారు. ఆయనకు బిజెపి, తెరాసలు మద్దతు ఇస్తున్నాయి. కనుక ఆ మూడు పార్టీలను ఎదుర్కోవాలంటే బలమైన కాంగ్రెస్ పార్టీ మద్దతు చాలా అవసరం.

2. బిజెపితో తెగతెంపులు చేసుకున్నాక కేంద్రప్రభుత్వం టిడిపిని అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది కనుక మళ్ళీ కేంద్రంలో బిజెపి, మోడీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలంటే బిజెపికి ఏకైక ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న కాంగ్రెస్ నేతృత్వంలో కూటమిని ఏర్పాటు చేయడం అత్యవసరం. 

3. కేంద్రం సహాయసహకారాలు, పూర్తి మద్దతు ఉంటేకానీ తన రాజకీయ శత్రువులైన తెలంగాణ సిఎం కేసీఆర్, జగన్మోహన్ రెడ్డిలను నియంత్రించడం సాధ్యం కాదు. మోడీ ప్రభుత్వం అందుకు సహకరించలేదు కనుక కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని భావించవచ్చు. 

4. అవినీతి విషయంలో మోడీ సర్కార్ చాలా కటువుగా ఉంటుంది కానీ కాంగ్రెస్ సర్కార్ కాదు. కాంగ్రెస్ నేతృత్వంలో ఫ్రంట్ ఏర్పాటు చేయాలనుకోవడానికి ఇదీ ఒక కారణంగా భావించవచ్చు.

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లయితే మొదటి సంతకం ఏపీకి ప్రత్యేకహోదా ఫైలుపైనే చేస్తానని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రకటించారు. అదీ ఒక కారణం కావచ్చు. 

చంద్రబాబునాయుడు తన, తన కుమారుడి, తన పార్టీ, తన రాష్ట్ర భవిష్యత్ కోసమే కాంగ్రెస్ నేతృత్వంలో కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నట్లు భావించవచ్చు. అంటే చంద్రబాబు తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడం చేస్తున్న పోరాటంగా భావించవచ్చు. 


Related Post