కేసిఆర్ ఎందుకు ఫ్రంట్ ఏర్పాటుచేయాలనుకొంటున్నారు?

January 07, 2019


img

 రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసిఆర్, చంద్రబాబునాయుడు ఇంచు మించు ఒకేసమయంలో జాతీయ స్థాయిలో కూటమిని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దేశ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు కోసం కేసిఆర్, మోడీని గద్దె దించాలని చంద్రబాబునాయుడు కూటమిని ఏర్పాటు చేస్తున్నామని చెప్పుకొంటున్నారు. కానీ నిజంగానే అవే కారణాలు, ఆశయంతో వారు కూటమిని ఏర్పాటు చేస్తున్నారా? లేక వేరేమైనా కారణాలు, ఆలోచనలు ఉన్నాయా? అని ఆలోచిస్తే వేరేవి కనిపిస్తాయి. 

ముందుగా కేసిఆర్ ఫ్రంట్ ఏర్పాటు గురించి చెప్పుకుంటే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం తన కొడుకు కేటీఆర్ ను ముఖ్యమంత్రిగా చేయలేరు. కనుక తన కుర్చీని కొడుకుకు అప్పజెప్పడానికే కేసిఆర్ ఈ సరికొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చారని కాంగ్రెస్, బిజెపి నేతల వాదన. ఒకవేళ కేసిఆర్ జాతీయ రాజకీయాలలోకి వెళితే జరుగబోయేది అదే కనుక వారి వాదనలో నిజముందని అర్ధమవుతోంది. 

కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని సిఎం కేసిఆర్ చెపుతున్నప్పటికీ, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులతో ఆయనకున్న అనుబంధాన్ని చూస్తున్నప్పుడు, ఆయన బిజెపికి సహాయపడేందుకే ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్నట్లు కనిపిస్తుంది. అందుకే ప్రధానిమోడీ కూడా ‘కేసిఆర్ ఫ్రంట్’ గురించి తనకేమీ తెలియదని చెప్పారనుకోవచ్చు. కాంగ్రెస్ మిత్రపక్షాలను తన ఫ్రంట్ వైపు ఆకర్షించడానికి కేసిఆర్ చేస్తున్న ప్రయత్నాలను చూస్తే, ఆయన లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని చావుదెబ్బ తీసి బిజెపికి సహాయపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది. 

అయితే మోడీ మళ్ళీ ప్రధానమంత్రి అయ్యేందుకు సహకరించడం వలన కేసిఆర్ కు ఏమి ప్రయోజనం అంటే కేంద్రమంత్రి పదవులు పొందవచ్చు. తద్వారా జాతీయ స్థాయిలో తన ఆలోచనలను, ప్రణాళికలను అమలుచేయవచ్చు. రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నుంచి మరింత సహాయ సహకారాలు పొందవచ్చు. పక్కలో బల్లెంలా ఉన్న తన రాజకీయశత్రువు చంద్రబాబునాయుడుకు కేంద్రం సహాయంతో చెక్ పెట్టవచ్చు. ఇటువంటి అనేక కారణాల చేత సిఎం కేసీఆర్ ఫెడరల్ ఏర్పాటుకు నడుం బిగించినట్లు భావించవచ్చు. చంద్రబాబునాయుడు ఫ్రంట్ ఏర్పాటుకు గల కారణాలను వేరేగా చెప్పుకొందాం.


Related Post