ఆ రెండు పార్టీలు ఫెడరల్ ఫ్రంటులో జేరినట్లేనా?

January 05, 2019


img

లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్నందున ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల వరకు బద్ధ శత్రువులుగా ఉన్న సమాజ్‌వాదీ (ఎస్పీ), బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ(బీఎస్పీ)లు ఇప్పుడు మిత్రులుగా మారిపోయాయి. అంతేకాదు...ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీతో దోస్తీ కొనసాగించిన ఆ రెండు పార్టీలు దానిని పక్కన బెట్టి రాష్ట్రంలో గల 80 ఎంపీ స్థానాలలో 74 సీట్లను చెరిసమానంగా పంచేసుకున్నాయి. 

అంటే యూపీలో కాంగ్రెస్, బిజెపిలు ఒంటరి పోరాటం చేయకతప్పదన్నమాట. ప్రస్తుతం బిజెపి కేంద్రంలో, యూపీలో కూడా అధికారంలో ఉంది కనుక దానికి  ఒంటరి పోరాటం చేయగల శక్తి ఉంది కానీ కాంగ్రెస్ పార్టీకి యూపీ రాష్ట్రమే పుట్టినిల్లు అయినప్పటికీ ఒంటరిగా పోరాడి గెలిచే శక్తిలేదు. కనుకనే అది ఎప్పుడూ ఎస్పీ, బీఎస్పీలతో అంటకాగుతూ ఉంటుంది. 

వాటిలో ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ కేసిఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంటుకు మద్దతు పలలికారు కనుక బీఎస్పీ కూడా మద్దతు పలుకవచ్చు. అవి యూపీలో కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకుంటే దానికి కొన్ని సీట్లు కేటాయించవలసి ఉంటుంది. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా అంగీకరించవలసి ఉంటుంది. కానీ ఫెడరల్ ఫ్రంటులో చేరితే తెరాసకు యూపీలో సీట్లు కేటాయించనవసరం లేదు. అంతేకాదు మాయావతి ప్రధానమంత్రి రేసులో పోటీ పడవచ్చు. కనుక ఆ రెండు పార్టీలు ఫెడరల్ ఫ్రంటులో చేరడం ఖాయంగానే భావించవచ్చు. 

యూపీలో ప్రస్తుతం బిజెపి అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాధ్ పాలన పట్ల అప్పుడే ప్రజలలో విముఖత కనిపిస్తోంది. కనుక బిజెపికి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్న ఎస్పీ, బీఎస్పీలకు కనీసం 40-50 సీట్లు గెలుచుకొనే అవకాశాలున్నాయని భావించవచ్చు. అంటే ఫెడరల్ ఫ్రంటులో తెరాస, వైకాపా, ఎస్పీ, బీఎస్పీలతో కలిపుకొని సుమారు 75 మంది లేదా అంతకంటే ఎక్కువే ఎంపీలు ఉండవచ్చు. మరో రెండు మూడు పార్టీలు తోడైతే లోక్‌సభ ఎన్నికల తరువాత డిల్లీలో ఫెడరల్ ఫ్రంటు చక్రం తిప్పవచ్చు. 


Related Post