పొత్తులకు అవినీతి అడ్డం కాదా?

January 05, 2019


img

కాంగ్రెస్ నేత విజయశాంతి మూడు రోజుల క్రితం బెంగళూరు వెళ్ళి అక్రమాస్తుల కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న శశికళతో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని జైలు అధికారులు కూడా దృవీకరించారు. తమిళనాడుకు చెందిన శశికళతో తెలంగాణకు చెందిన విజయశాంతికి ఏమి సంబందం? ఆమెతో విజయశాంతికి ఏమి పని పడింది?అనే సందేహం కలుగకమానదు. దీనికి చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోవాలి. 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ఆకస్మిక మరణం తరువాత శశికళ పార్టీని, ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించడం, అప్పుడు కేంద్రప్రభుత్వం శశికళ అక్రమాస్తులకేసును తిరుగదోడి ఆమెను నాలుగేళ్ళపాటు జైలుకు పంపించడం, ఆనక పన్నీరు సెల్వమ్, పళనిస్వామిల మద్య రాజీ కుదిర్చి ప్రభుత్వం ఏర్పాటు చేసి తమిళనాడు రాజకీయాలపై పట్టు సాధించడం, అన్నాడిఎంకె మద్దతు పొందడం వంటి అనేక పరిణామాలు జరిగాయి. 

చేతికి అందివచ్చిన ముఖ్యమంత్రి పదవిని దక్కనీయకుండా చేసి, జైలుకు పంపించినందుకు శశికళ మోడీ ప్రభుత్వం బిజెపిపై పగతో రగిలిపోతున్నారు. శత్రువుకి శత్రువు మిత్రుడు అవుతాడనే రూల్ ప్రకారం కాంగ్రెస్ పార్టీకి శత్రువైన బిజెపికి శత్రువు శశికళ కాంగ్రెస్ పార్టీకి మిత్రురాలిగా కనిపించడం సహజమే. కనుకనే విజయశాంతి బెంగళూరు వెళ్ళి ఆమెను జైలులో కలిశారు.    

అయితే జైలులో ఉన్న శశికళ కాంగ్రెస్ పార్టీకి ఏవిధంగా సహాయపడగలదు? అని అనుకొనక్కరలేదు. ఆమె జైలులో ఉన్నప్పటికీ తన మేనల్లుడు దినకరన్ ద్వారా అన్నాడిఎంకెలో ఒకవర్గంపై మంచి పట్టు కలిగి ఉన్నారు. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న డిఎంకె ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీ నాయకత్వానికి పూర్తిగా మద్దతు పలికింది. కనుక శశికళ మద్దతు కూడా కూడగట్టగలిగితే లోక్‌సభ ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారం చేజిక్కించుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది. లోక్‌సభ ఎన్నికల తరువాత అధికార అన్నాడిఎంకె పార్టీ బిజెపికి అండగా నిలబడుతుంది కనుక, దానిలో రెండో వర్గం మద్దతు కూడా గట్టేందుకే విజయశాంతి శశికళను కలిసినట్లు తెలుస్తోంది.


Related Post