మున్సిపాలిటీలలో పంచాయతీల విలీనం మంచిదేనా?

January 05, 2019


img

కరీంనగర్‌, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్‌, నల్గొండ, మెదక్‌, మహబూబ్‌నగర్‌ తదితర జిల్లాలోని కొన్ని మున్సిపాలిటీల పరిధిలో ఉండే గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలలో విలీనం చేయడాన్ని సవాలు చేస్తూ ఆయా జిల్లాల నుంచి సుమారు 95కు పైగా పిటిషన్లు హైకోర్టులో దాఖలయ్యాయి. వాటిపై శుక్రవారం జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్‌, జస్టిస్‌ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. 

పిటిషనర్ల తరపున వాదించిన సీనియర్‌ న్యాయవాదులు వేదుల వెంకటరమణ, రచనారెడ్డి, పంచాయితీల విలీనంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి శాస్త్రీయమైన విధానాలు పాటించకుండా ఇష్టం వచ్చినట్లు విలీనం చేసిందని ఆరోపించారు. పంచాయతీలను విలీనం చేయదలచుకుంటే రాష్ట్ర ప్రభుత్వం ముందుగా వాటిని డీనోటిఫై చేసి, అక్కడ వ్యవసాయేతర రంగాలపై ఆధారపడిన జనాభా, జనసాంద్రత, తలసరి ఆదాయం, ఉపాధి తదితర అంశాలపై శాస్త్రీయంగా అధ్యయనం చేయాల్సి ఉంది. కానీ అవేవీ చేయకుండా... కనీసం పంచాయతీ తీర్మానాలు కూడా చేయకుండా ఏకపక్షంగా మున్సిపాలిటీలలో విలీనం చేసిందని వాదించారు. పల్లెలలో ఆధునిక పోకడలు కనిపించినంత మాత్రన్న వాటిని పట్టణాలలో కలిపేయడం సరికాదని దాని వలన గ్రామీణ వ్యవస్థలు మటుమాయం అవుతాయని వాదించారు. అనాలోచితంగా పట్టణాలను వ్యాపింపజేయడం వలన రాష్ట్రంలో వ్యవసాయం తగ్గిపోయే ప్రమాదం ఉందని వాదించారు. 

ప్రభుత్వం తరపున వాదించిన అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జె.రామచంద్రరావు, “దీనిపై శాస్త్రీయంగా అధ్యయనం చేసిన తరువాతే ఎంపిక చేసిన కొన్ని పంచాయతీలను మున్సిపాలిటీలలో విలీనం చేసింది. పట్టణాలలో లభిస్తున అన్నీ సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు గ్రామీణ ప్రాంతాలకు కూడా అందజేయాలనే ఉద్దేశ్యంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొంది. ఒకవేళ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు చెప్పినట్లయితే, ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని ఆయా పంచాయతీలకు 21 రోజులలో ఎన్నికలు నిర్వహించడానికి సిద్దంగా ఉందని చెప్పారు. ఒకవేళ ఆ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించినట్లయితే ఎన్నికైన సర్పంచుల పదవీకాలం 5 ఏళ్ళు ఉంటుంది గనుక మళ్ళీ అప్పటి వరకు ఈ విలీనం సాధ్యపడదని ఏఏజీ జె.రామచంద్రరావు హైకోర్టుకు తెలిపారు. 


Related Post