రాష్ట్రంలో మరో సంక్షేమ పధకానికి శ్రీకారం

January 04, 2019


img

పాలనకు మానవీయకోణం జోడిస్తే అది తెలంగాణ ప్రభుత్వం అవుతుందంటే అతిశయోక్తి కాదు. సిఎం కేసీఆర్ తమ ప్రత్యర్ధుల పట్ల ఎంత కటినంగా వ్యవహరించినప్పటికీ, రాష్ట్ర ప్రజల పట్ల ముఖ్యంగా నిరుపేద గ్రామీణ ప్రజల పట్ల కన్నతండ్రిలా మమకారం చూపుతుంటారు. అందుకే కేసిఆర్ కిట్స్, రైతు భీమా, బతుకమ్మ చీరలు, ఒంటరి మహిళలకు, బోధకాలు వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు, నిరుపేద కిడ్నీ రోగులకు ఉచితంగా రక్తశుద్ది (డయాలసిస్) కంటివెలుగు వంటి అనేక గొప్ప గొప్ప పధకాలను రూపొందించి అంతే చిత్తశుద్దితో వాటిని అమలుచేయిస్తున్నారు. 

ఇతర రాష్ట్రాలు కూడా తెరాస ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఆ పధకాలను స్ఫూర్తిగా తమతమ రాష్ట్రాలలో కూడా అటువంటి పధకాలను ప్రవేశపెడుతున్నాయి. ఉదాహరణకు ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు రైతు బంధు, రైతు భీమా పధకాలను స్వీకరించి అమలుచేస్తుంటే, మహారాష్ట్ర, ఉత్తర్ ప్రదేశ్, హర్యానా తదితర రాష్ట్రాలు మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ పధకాలను స్వీకరించి అమలుచేయడానికి సన్నాహాలు చేసుకొంటున్నాయి. 

మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కేసీఆర్ మరో కొత్త సంక్షేమ పధకానికి శ్రీకారం చుట్టారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కంటివెలుగు పధకం ద్వారా లక్షలాది మంది నిరుపేద ప్రజలకు ఉచితంగా కంటిపరీక్షలు, చికిత్సలు చేయించి, మందులు, కళ్ళద్దాలు కూడా అందజేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు చెవులు-ముక్కు-గొంతు (ఈ.ఎన్.టి.) సమస్యలతో బాధపడుతున్న రోగులకు ఉచితంగా పరీక్షలు, చికిత్సలు, వినికిడి పరికరాలు అందజేయాలని నిర్ణయించారు. 

ఈ పధకం అమలు కోసం అవసరమైన ఏర్పాట్లు మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రధానకార్యదర్శి ఎస్.కె.జోషి ఆరోగ్యశాఖను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, ఆ శాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యి ఈ పధకం అమలు గురించి చర్చించారు. ముందుగా రాష్ట్రంలో ఈ.ఎన్.టి. సమస్యలతో బాధపడుతున్నవారి గణాంకాలు సిద్దం చేసి వాటిని బట్టి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఎస్.కె.జోషి ఆదేశించారు. అవసరమైతే రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసి అక్కడ ప్రయోగాత్మకంగా ఈ.ఎన్.టి. వైద్య శిభిరాలను నిర్వహించాలని ఎస్.కె.జోషి అధికారులను ఆదేశించారు. కనుక అతి త్వరలోనే ఈ కొత్త సంక్షేమ పధకం కూడా రాష్ట్రంలో ప్రారంభం కాబోతోంది.


Related Post