ఆ అహంభావమే కూడదు సార్!

January 04, 2019


img

తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా హుందాగా మాట్లాడుతారనే మంచి పేరుంది. కానీ ఆయన కూడా తమ రాజకీయ ప్రత్యర్ధులను ఉద్దేశ్యించి చులకనగా, హేళనగా మాట్లాడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయాలలో ఆవిధంగా వ్యవహరించడం అవసరమని తెరాస నేతలు సమర్ధించుకోవచ్చునేమో కానీ అది ఆమోదయోగ్యం కాదని చెప్పక తప్పదు. 

ఈరోజు తెలంగాణ భవన్ లో నల్గొండ జిల్లా తెరాస కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ, “అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ ప్రజలు గుంజి కొడితే ఆ శబ్దవిప్లవానికి పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గూబ పగిలింది. తెరాస ఎన్నికల గుర్తు కారును పోలిన ‘ట్రక్కు గుర్తు’ ఉన్నందునే ఆయన విజయం సాధించగలిగారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా అహంకారం ఉంది. అలాగే సీనియర్ నేతలైన జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వంటివారు ఏనాడూ జెడ్పీ సమావేశాలకు హాజరుకాలేదు. చంద్రబాబునాయుడు ఇచ్చిన రూ.500 కోట్లకు ఆశపడి కాంగ్రెస్ నేతలు మళ్ళీ ఆయనను తెలంగాణలోకి పట్టుకువచ్చారు. కానీ తెలంగాణ ప్రజలు వారందరికీ తగినవిధంగా బుద్ధి చెప్పి తమ అస్తిత్వాన్ని కాపాడుకున్నారు. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ నేతలకు ఏమి చేయాలో పాలుపోవడంలేదు. కనీసం పోటీ చేయగలిగే పరిస్థితులలో కూడా లేరు. కనుక పంచాయతీ, లోక్‌సభ ఎన్నికలలో తెరాస మళ్ళీ ఘనవిజయం సాధించడం ఖాయం. అందుకు తెరాస నేతలు, కార్యకర్తలు అందరూ కలిసికట్టుగా పనిచేయాలి,” అని అన్నారు. 

కాంగ్రెస్ నేతలకు అహంకారం ఉందని చెపుతూ కేటీఆర్ కూడా అదేవిధంగా అహంభావం ప్రదర్శించడం విడ్డూరంగా ఉంది. రాజకీయాలలో తనకంటే సీనియర్స్ అయిన కాంగ్రెస్ నేతలను ఉద్దేశ్యించి ‘గూబ పగిలింది’ అంటూ హేళన చేయడం సరికాదు. రాజకీయాలలో ఉన్నవారు ఒక మెట్టు దిగితే అవతలివారు కూడా రెండు మెట్లు దిగి అదే రకంగా మాట్లాడుతారని మరిచిపోకూడదు. అది ఎవరికైనా అవమానకరమే కనుక అటువంటి పరిస్థితులు వద్దనుకుంటే అధికారంలో ఉన్నవారే హుందాతనం పాటిస్తూ మాట్లాడుతుంటే వారి ప్రత్యర్ధులు కూడా హుందాగా మాట్లాడుతారు. తద్వారా రాజకీయాల స్థాయి మళ్ళీ పెరుగుతుంది.


Related Post