పంచాయతీ ఎన్నికలలో తెరాస ఓపెన్ ఆఫర్...అందుకేనా?

January 04, 2019


img

ఈ నెల 7వ తేదీ నుంచి 30 వరకు మూడు దశలలో ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక తెరాస వాటిలో కూడా ఘనా విజయం సాధించడానికి గట్టి ప్రయత్నాలు చేస్తోంది. తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం సిరిసిల్లాలో తెరాస నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “పంచాయతీ ఎన్నికలలో   మనతో పోటీ పడేందుకు ప్రతిపక్షమే లేదు కనుక ఇప్పుడు మనలో మనమే పోటీ పడవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే దాని వలన మనకే నష్టం. కనుక మీరందరూ కూర్చొని మాట్లాడుకొని  పంచాయతీ ఎన్నికలలో ఏకగ్రీవంగా జరిగేలా చేయాలి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మండల అధ్యక్ష పదవులు, సొసైటీ పదవులు, నామినేటడ్ పదవులు అనేకం ఉన్నాయి. కనుక వాటిని మీలో మీరే సర్దుబాటు చేసుకొని ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగేలా చేసుకోవాలి. అటువంటి పంచాయతీలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.10 లక్షలు నిధులు మంజూరు చేస్తుంది. సిరిసిల్లా జిల్లాలో ఏకగ్రీవ పంచాయతీలకు ఆధనంగా మరో రూ.15 లక్షలు చొప్పున ఇస్తామని హామీ ఇస్తున్నాను. కనుక మనలో మనం పోటీలు పడి నష్టపోవడం కంటే అందరూ కలిసికట్టుగా ఉంటూ అన్ని పంచాయతీలపై గులాబీ జెండాలు రెపరెపలాడిద్దాం,” అని అన్నారు. 

కేటీఆర్ చెపుతున్నట్లు పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ హడావుడి కనిపించడం లేదనే మాట వాస్తవం. అయితే పూర్తిగా లేదనుకోవడం కూడా సరికాదు. అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదే ఊపుతో తమ తమ నియోజకవర్గాలలో పంచాయతీలపై కూడా పట్టుసాధించాలని ప్రయత్నిస్తుంటే, ఎన్నికలలో ఓడిపోయిన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జీవన్ రెడ్డి, జానారెడ్డి, డికె అరుణ, షబ్బీర్ ఆలీ వంటి సీనియర్ కాంగ్రెస్ నేతలు పంచాయతీ ఎన్నికలలో తెరాసను ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని పట్టుదలగా పనిచేస్తున్నారు. బహుశః అందుకే ఏకగ్రీవ పంచాయతీలకు తెరాస రూ.10 లక్షలు ఓపెన్ ఆఫర్ ప్రకటించిందని భావించవచ్చు.


Related Post