ఉత్తమ్ కుమార్ రెడ్డికి మరో అవకాశం

January 03, 2019


img

అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయంతో నేటికీ ఆ పార్టీలో చాలామంది నేతలు ఇంకా తేరుకోలేదు. ఇక పార్టీ కార్యకర్తల సంగతి సరేసరి. ఈ పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎన్నికలను, వెంటనే లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కోవలసి వస్తోంది. కనుక పార్టీని పునరుత్తేజపరచడానికి కొత్తగా ఏర్పడబోయే ములుగు, నారాయణపేట జిల్లాలతో సహా 33 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను నియమించడానికి కాంగ్రెస్ పార్టీ సన్నాహాలు మొదలుపెట్టింది. 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదేశాలమేరకు గురువారం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ రామచంద్ర కుంతియా పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యి ఈ అంశంపై చర్చించారు. వారం రోజుల లోపుగా డిసిసి అధ్యక్షుల నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నారు. 

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత పార్టీలో ఓటమిపై కొంత చర్చ జరిగినప్పటికీ సీనియర్ నేతలు ఎవరూ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని పట్టుబట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. పార్టీ ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని, మళ్ళీ గాంధీ భవన్ మెట్లు తొక్కనని ప్రతిజ్ఞలు చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా వాటిని మరిచినట్లు యధాప్రకారం పదవిలో కొనసాగుతుండటం ఆశ్చర్యమే. తెరాస నేతలు ఎవరూ ఉత్తమ్ కుమార్ రెడ్డిని తన ప్రతిజ్ఞల గురించి నిలదీయకపోవడం అన్నిటికంటే ఆశ్చర్యం కలిగిస్తుంది. 

అయితే ప్రస్తుత పరిస్థితులలో పిసిసి అధ్యక్షుడుగా ఎవరు ఉన్నప్పటికీ దాని వలన పార్టీ పరిస్థితులలో ఎటువంటి మార్పు రాదు...ఏ ప్రయోజనం ఉండబోదనే ఉద్దేశ్యంతోనే కాంగ్రెస్ అధిష్టానం కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డిని రాజీనామా చేయాలని అడగలేదేమో? ఒకవేళ లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కనీసం 5-6 సీట్లు గెలుచుకోగలిగితేనే ఆ పార్టీ మళ్ళీ కోలుకొనే అవకాశం ఉంటుంది. కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డికి వెంటనే మరో అవకాశం లభించినట్లే. అప్పుడు కూడా కాంగ్రెస్ ఓడిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉద్వాసన తప్పకపోవచ్చు.


Related Post