ఏపీలో రాజకీయాలు మాత్రమే జరుగుతాయా?

January 03, 2019


img

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు విడిపోయిన తరువాత రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీ పడతాయని అందరూ భావించారు. ఏపీకి ఆర్ధిక సమస్యలున్నప్పటికీ కేంద్రం సహాయసహకారాలు ఉన్నందున శరవేగంగా అభివృద్ధి సాధిస్తుందని అందరూ భావించారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి సాధించగలిగింది కానీ ఏపీ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుంది. ఏపీలో టిడిపి, వైకాపా, బిజెపి, జనసేన పార్టీల రాజకీయాలతోనే పుణ్యకాలం కాస్తా పూర్తయిపోయింది. మళ్ళీ ఎన్నికలు కూడా వచ్చేస్తున్నాయి. పైగా చంద్రబాబునాయుడుకి శత్రువులు కూడా పెరిగిపోయారు. ఒకపక్క తెలంగాణ సిఎం కేసీఆర్ బాబుకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటున్నారు. ఇక జగన్ అయితే గత 10 నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ చంద్రబాబునాయుడు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. బిజెపితో తెగతెంపులు చేసుకోవడం వలన అది కూడా టిడిపికి శత్రువుగా మారి సవాళ్ళు విసురుతోంది. బిజెపితో పాటు జనసేన కూడా ఎప్పుడో టిడిపికి దూరం అయ్యింది. ఈ పరిస్థితులలో టిడిపి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలను ఒకేసారి ఎదుర్కోవలసివస్తోంది. 

కనుక చంద్రబాబునాయుడు మళ్ళీ జనసేన పార్టీతో పొత్తులు పెట్టుకోవడానికి సిద్దం అయ్యారు. తమ పార్టీ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో చేస్తున్న పోరాటంలో జనసేన కూడా కలిసిరావలని చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. అయితే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయనకు పెద్ద షాక్ ఇచ్చారు. 

“వచ్చే ఎన్నికలలో మాపార్టీ రాష్ట్రంలో 175 స్థానాలకు పోటీ చేస్తుంది. మేము వామపక్షాలతో తప్ప వేరే ఏ పార్టీలతోనూ పొత్తులు పెట్టుకోము. టిడిపి లేదా వైకాపాలు మా గురించి చెపుతున్న మాటలను ఎవరూ నమ్మవద్దు. మా పార్టీ యువతకు, మహిళలకు, కొత్తవారికి, వివిద రంగాలలో అనుభవ అనుభవజ్ఞులైనవారికి, టికెట్లు కేటాయిస్తుంది,” అని ట్వీట్ ద్వారా సమాధానం ఇచ్చారు. 


Related Post