నెలాఖరు వరకు మంత్రివర్గ విస్తరణ లేనట్లేనా?

January 02, 2019


img

పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్రంలో మళ్ళీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని ఎన్నికల సంఘం తెలిపింది. కనుక శాసనసభ సమావేశాలు, మంత్రివర్గ విస్తరణ చేపట్టరాదని, తమ అనుమతి లేనిదే ఐఏఎస్, ఐ‌పి‌ఎస్ అధికారులను బదిలీలు చేయరాదని, బతుకమ్మ చీరలు, రైతుబంధు చెక్కుల పంపిణీ తక్షణం నిలిపివేయాలని ఎన్నికల సంఘం ప్రభుత్వానికి సూచించింది. జిల్లా, మున్సిపల్, మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించుకోవచ్చు కానీ విధానపరమైన నిర్ణయాలు తీసుకోరాదని ఆదేశించింది. జిల్లా, రాష్ట్ర సరిహద్దులలో మళ్ళీ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనికీలు మొదలుపెట్టాలని రాష్ట్ర పోలీస్ శాఖను ఆదేశించింది. 

ఎన్నికల షెడ్యూల్ వెలువడితే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని అప్పుడు ఇటువంటి ఆంక్షలు అమలులోకి వస్తాయని ముఖ్యమంత్రి కేసిఆర్ కు తెలియదనుకోలేము. కానీ ఏవో కారణాలతో శాసనసభను సమావేశపరిచలేదు. ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకారం చేయించలేదు. ఇంతవరకు మంత్రివర్గం కూడా ఏర్పాటు చేయలేదు. ఈ ఆంక్షల కారణంగా తెరాసలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన 88 ఎమ్మెల్యేలున్నప్పటికీ ఈ నెలాఖరు వరకు పూర్తిస్థాయి ప్రభుత్వం ఏర్పాటు చేయలేని దుస్థితి ఏర్పడింది. కనుక పంచాయతీ ఎన్నికలు పూర్తయ్యేవరకు అధికారులతోనే ప్రభుత్వం నడిపించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అవి పూర్తయిన తరువాత ఎప్పుడైనా లోక్‌సభ ఎన్నికలకు గంట మ్రోగే అవకాశం ఉంది కనుక రాష్ట్రంలో మంత్రివర్గం ఎప్పుడు ఏర్పాటవుతుందో చూడాలి. 


Related Post