ఒక్కో ఎన్నికలకు ఒక్కో కారణం!

January 02, 2019


img

రాజకీయ పార్టీల ఏకైక లక్ష్యం ఎన్నికలలో గెలిచి అధికారం చేజిక్కించుకోవడమే. కనుక అందుకోసం అవి అనేక రకాల ప్రయత్నాలు, వ్యూహాలు అమలుచేస్తుంటాయి. అసెంబ్లీ ఎన్నికలలో తెరాస కూడా అటువంటి వ్యూహమే అమలుచేసి విజయం సాధించింది. 

‘ప్రజాకూటమి ముసుగులో కాంగ్రెస్ పార్టీతో కలిసి చంద్రబాబునాయుడు తెలంగాణలో మళ్ళీ పెత్తనం చలాయించాలని వస్తున్నాడని, కనుక కూటమికి ఓటేస్తే రాష్ట్రంలో ప్రాజెక్టులు, సంక్షేమ పధకాలు నిలిచిపోతాయని, కరెంటు సమస్యలు మళ్ళీ మొదలవుతాయని.. చివరికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడక మునుపటి దయనీయ పరిస్థితులు మళ్ళీ దాపురిస్తాయని బలంగా వాదించి ప్రజలను మెప్పించి తెరాస విజయం సాధించింది. 

తెరాస ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించింది. ఆ ఎన్నికలలో విజయం సాధించేందుకు మరో కొత్త వ్యూహం రూపొందించుకొని అమలుచేస్తోంది. అదేమిటంటే ‘కేంద్రంలో తెలంగాణ రాష్ట్రం నిర్ణయాత్మక పాత్ర పోషించి, కేంద్రం మెడలు వంచి తెలంగాణ రాష్ట్రానికి కావలసిన నిధులు, ప్రాజెక్టులను రాబట్టుకోవాలంటే రాబోయే పార్లమెంటు ఎన్నికలలో తెరాసకు 16 ఎంపీ సీట్లు గెలిపించాలి’ అనేది తెరాస తాజా వ్యూహం.  

తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పలు సభలలో, సమావేశాలలో దీనిని గట్టిగా నొక్కి చెపుతున్నారు. ఈరోజు సనత్ నగర్ లో పార్టీ కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ మళ్ళీ ఇదే చెప్పారు. తెరాస 16 ఎంపీ సీట్లు గెలుచుకోవడానికి ఎటువంటి వ్యూహామైనా అమలుచేసుకోవచ్చు. కానీ పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్, బిజెపిలు ఓడిపోతాయని, అప్పుడు తాము డిల్లీలో చక్రం తిప్పుతామని, కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి నిధులు, ప్రాజెక్టులు సాధించుకొస్తామని ఊహాజనితమైన కబుర్లు చెపుతూ తెరాస 16 ఎంపీ సీట్లను గెలుచుకోవాలని ప్రయత్నించడం ప్రజలను మభ్యపెట్టడమేనని చెప్పవచ్చు. 

ఒకవేళ కేంద్రంలో కాంగ్రెస్ లేదా మళ్ళీ మోడీయే పూర్తి మెజార్టీతో అధికారంలోకి వస్తే అప్పుడు తెరాసకు ఎన్ని ఎంపీ సీట్లు వస్తే మాత్రం ఏమి తేడా ఉంటుంది?ఒకవేళ ఆ రెండు పార్టీలకు ప్రభుత్వ ఏర్పాటు తగినంత మెజార్టీ లభించనప్పుడు, వాటికి తెరాస కంటే ఎక్కువ సీట్లు గెలుచుకొనే అవకాశమున్న బిఎస్పీ, సమాజ్ వాదీ, టిడిపి తదితర పార్టీలు మద్దతు ఇచ్చి కేంద్రంలో చక్రం తిప్పవచ్చు కదా? కనుక 16 ఎంపీ సీట్లు గెలుచుకోవడానికే తెరాస ఈ వాదన తెరపైకి తీసుకువచ్చిందని చెప్పవచ్చు. 

కెసిఆర్ కేంద్రంలో చక్రం తిప్పాలనుకుంటే ముందుగా ఫెడరల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసుకోవాలి. పార్లమెంటు ఎన్నికలలో ఫెడరల్ ఫ్రంట్ కనీసం 100-150 సీట్లు గెలుచుకోవాలి. ఆ ఫెడరల్ ఫ్రంట్ లో అన్ని పార్టీల అధినేతలు కేసిఆర్ నాయకత్వాన్ని అంగీకరించాలి లేదా ఏకాభిప్రాయం కలిగి ఉండాలి. అప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది తప్ప రాష్ట్రంలో తెరాస 16 ఎంపీ సీట్లు గెలుచుకొన్నంత మాత్రన్న డిల్లీలో మార్పులేవీ రావని ఖచ్చితంగా చెప్పవచ్చు.


Related Post