అయోధ్య రామాలయ నిర్మాణానికి ఆర్డినెన్స్?

January 01, 2019


img

యూపీలోని అయోద్యలో బాబ్రీ మసీదు-రామాలయ వివాదం న్యాయస్థానాలలో ఎంతకీ తేలకపోవడంతో తీవ్ర అసహనం చెందుతున్న హిందువులు మందిర నిర్మాణం కోసం ఆర్డినెన్స్ జారీ చేయాలంటూ తమపై నానాటికీ ఒత్తిడి పెంచుతున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అయితే న్యాయప్రక్రియ పూర్తయిన తరువాతే అటువంటి ఆలోచన చేస్తామని మోడీ చెప్పారు. న్యాయప్రక్రియ పూర్తికాకుండా అడ్డుకొనేందుకే కాంగ్రెస్ పార్టీతో సహా అనేక మంది అవరోధాలు సృష్టిస్తున్నారని మోడీ ఆరోపించారు. రాజ్యాంగం పరిధిలోనే రామాలయ నిర్మించాలన్నది తమ పార్టీ అభిప్రాయమని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. అయితే న్యాయస్థానంలో ఈ సమస్యకు పరిష్కారం లభించకపోతే కేంద్రప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తిస్తుందని మోడీ అన్నారు. త్వరలోనే దీనికి న్యాయస్థానంలో పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ చెప్పారు. 

అంటే ఒకవేళ సుప్రీంకోర్టులో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం లభించనట్లయితే, రామాలయ నిర్మాణానికి ఆర్డినెన్స్ జారీ చేయాలనుకొంటున్నట్లు ప్రధాని నరేంద్రమోడీ చెప్పినట్లే భావించవచ్చు. గత రెండున్నర దశాబ్ధాలుగా దేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తప్పక వినబడే అంశం అయోద్యలో రామాలయ నిర్మాణం. అయితే కేంద్రంలో బిజెపియే అధికారంలో ఉన్నప్పుడు కూడా రామాలయ నిర్మాణం చేయలేదు. అంటే అయోద్యలో రామాలయ నిర్మాణం బిజెపికి కేవలం ఎన్నికల అంశమేనని స్పష్టం అవుతోంది.  గత నాలుగున్నరేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ఆలోచనలేవీ చేయని ప్రధాని నరేంద్రమోడీ ఇప్పుడు ఎందుకు ఆర్డినెన్స్ జారీ చేస్తామంటున్నారంటే త్వరలో జరుగబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే అని చెప్పవచ్చు. ఆలయ నిర్మాణం కోసం ఆర్డినెన్స్ జారీ చేసినట్లయితే, కాంగ్రెస్ పార్టీ దాని మిత్రపక్షాలు అడ్డుకొనే ప్రయత్నాలు చేయడం ఖాయం. అయినా బిజెపి ముదుకు సాగే ప్రయత్నాలు చేయడం కూడా ఖాయమే. ఈ అంశంపై ఆ రెండు పార్టీల మద్య జరిగే వాగ్వాదాలు, విమర్శలు ప్రతివిమర్శల ద్వారా బిజెపి హిందూ ఓట్లకు గాలం వేస్తే, కాంగ్రెస్ పార్టీ ముస్లింలు, లౌకికవాదుల ఓట్లకు గాలం వేసే ప్రయత్నాలు చేసి దాని నుంచి రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నించడం ఖాయం. అంటే అయోద్యలో రామాలయ నిర్మాణం బిజెపి, కాంగ్రెస్ పార్టీలు రెంటికీ కేవలం ఎన్నికల అంశమేనని స్పష్టం అవుతోంది.


Related Post