కేసీఆర్‌ ఫ్రంట్‌ తెలియదు కానీ బాబు ఫ్రంట్ తెలుసునట!

January 01, 2019


img

ప్రధాని నరేంద్రమోడీ మంగళవారం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏర్పాటు చేస్తున్న కూటమిపై ఆసక్తికరమైన వ్యాక్యలు చేశారు. తనకు కేసిఆర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తున్న సంగతి తెలియదని కానీ కాంగ్రెస్ నేతృత్వంలో చంద్రబాబునాయుడు ఏర్పాటు చేస్తున్న ఫ్రంట్ గురించి తెలుసునని చెప్పడం విశేషం. 

తెలంగాణ రాష్ట్రంపై విద్వేషంతోనే చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పార్టీతో చేతులు కలిపి ఫ్రంట్ ఏర్పాటు చేసి భంగపడ్డారని మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీలు కలిసినంత మాత్రన్న ప్రజలు కలవరని గ్రహించేందుకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే మంచి ఉదాహరణ అని మోడీ అన్నారు. పరస్పర విరుద్దభావాలున్న పార్టీలు కలిసి పోటీ చేసినా ప్రజలు అంగీకరించబోరని ఎన్నికలలో రుజువైందని అన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా వ్యతిరేకించినవారు, కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళినవారు అందరూ తమతమ స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసమే మళ్ళీ కూటమిగా ఏర్పడుతున్నారని మోడీ అన్నారు. తెలంగాణలో జరిగినట్లే జాతీయస్థాయిలో ఒక్క మోడీని గద్దె దించడానికి విభిన్న ఆలోచనలు, ఆశలు కలిగిన పార్టీలు మహాకూటమిగా జత కడుతున్నాయని, వాటికీ తెలంగాణలో కూటమికి ఎదురైన చెడు అనుభవమే ఎదురవవచ్చునని మోడీ అన్నారు. దేశాభివృద్ధిని కోరుకొంటున్న ప్రజలు అధికార దాహంతో వస్తున్న ఇటువంటి కూటమిని అవి చేసే రాజకీయాలను ఆమోదించబోరని ప్రధాని నరేంద్రమోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటవుతున్న కూటమి గురించి ఇంత మాట్లాడిన ప్రధాని నరేంద్రమోడీకి, కాంగ్రెస్, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా కేసిఆర్ ఏర్పాటు చేస్తున్న ఫెడరల్ ఫ్రంట్ గురించి తెలియదని చెప్పడం విడ్డూరంగా ఉంది. అయితే కేసిఆర్ ఫ్రంట్ గురించి తనకు తెలియదని చెప్పడం ద్వారా దాని ఏర్పాటుకు తమకు ఎటువంటి అభ్యంతరాలు లేవని, లోక్‌సభ ఎన్నికల తరువాత అది తమకు సహకరించవచ్చునని ప్రధాని నరేంద్రమోడీ చెప్పకనే చెప్పారని భావించవచ్చు. 

    



Related Post