మంత్రివర్గం ఏర్పాటు ఇంకా ఎప్పుడో?

January 01, 2019


img

డిసెంబరు 12వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అంటే నేటికీ మూడు వారాలయ్యింది కానీ ఇంతవరకు రాష్ట్రంలో మంత్రివర్గం ఏర్పాటు ఊసే వినిపించడం లేదు. డిసెంబరు నెలాఖరులోగా సిఎం కేసీఆర్ మంత్రివర్గం ఏర్పాటు చేస్తారని మీడియాలో వార్తలు వచ్చాయి కానీ జరుగలేదు. శాసనసభను సమావేశపరిచి కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రమాణస్వీకరాలు చేయించవలసి ఉంది.

స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లను నియమించుకోవలసి ఉంది. కానీ ఈ కార్యక్రమాలు కూడా జరుగకపోవడంతో సిఎం కేసీఆర్ తీరును ప్రతిపక్షాలు కూడా తప్పు పడుతున్నాయి. ఎటువంటి కారణం లేకుండా శాసనసభను రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళిన కేసిఆర్, మళ్ళీ ఎన్నికలలో గెలిచినా ఇంతవరకు ఎందుకు ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ముఖ్యమైన ఈ కార్యక్రమాలను పూర్తి చేయకుండా అప్రధాన్యమైన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం రాష్ట్రాలు తిరుగుతున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఇక తెరాసలో ఎవరూ మంత్రివర్గం ఏర్పాటు, శాసనసభ సమావేశాల గురించి మాట్లాడకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. జనవరి 5 నుంచి మళ్ళీ సంక్రాంతి పండుగ పూర్తయ్యేవరకు మంచి రోజులు లేవు కనుక ఈలోగానైనా కేసిఆర్ మంత్రివర్గం ఏర్పాటు చేస్తారో లేదో చూడాలి.


Related Post