నేటి నుంచి ఏపీ, తెలంగాణ హైకోర్టులు ఏర్పాటు

January 01, 2019


img

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు నేటి నుంచి వేర్వేరుగా హైకోర్టులు పనిచేయడం మొదలుపెట్టబోతున్నాయి. గవర్నర్ నరసింహన్ ఈరోజు ఉదయం 8.30 గంటలకు రాజ్‌భవన్‌లో తెలంగాణ హైకోర్టు ప్రధానన్యాయమూర్తి జస్టిస్ టిబి రాధాకృష్ణన్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సిఎం కేసీఆర్, హోంమంత్రి మహమూద్ ఆలీ, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు కాగానే ఉమ్మడి హైకోర్టు బోర్డును తొలగించి దాని స్థానంలో “హైకోర్ట్ ఫర్ ది తెలంగాణ స్టేట్‌” అనే కొత్త బోర్డును కూడా ఏర్పాటు చేశారు. 

అనంతరం గవర్నర్ నరసింహన్ ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకొని స్థానిక ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధానన్యాయమూర్తిగా జస్టిస్ చాగరి ప్రవీణ్‌కుమార్‌ మరియు హైకోర్టు న్యాయమూర్తుల చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సిఎం చంద్రబాబునాయుడు, రాష్ట్ర మంత్రులు, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు హాజరయ్యారు.  

నేటి నుంచి రెండు రాష్ట్రాల హైకోర్టులు వేర్వేరుగా పనిచేస్తాయి. ఏపీలో జనవరి 4వరకు హైకోర్టు పనిచేస్తుంది. 5వ తేదీ నుంచి 21వ తేదీ వరకు సంక్రాంతి శలవులు ఉంటాయి. అయితే ఈ సమయంలో వారానికి రెండు రోజుల చొప్పున ‘వెకేషన్ కోర్టు’ పనిచేస్తుంటుంది. దాని కోసం విజయవాడలోని సిఎం క్యాంప్ కార్యాలయాన్ని కేటాయించారు. శలవుల అనంతరం అమరావతిలో సిద్దమవుతున్న తాత్కాలిక ‘జ్యూడీషియల్ కాంప్లెక్స్’ లో పూర్తిస్థాయిలో ఏపీ హైకోర్టు పనిచేయడం ప్రారంభిస్తుంది.  తెలంగాణ హైకోర్టు యధాప్రకారం చిరకాలంగా ఉన్న హైకోర్టు భవనంలోనే కొనసాగుతుంది.


Related Post