ట్రిపుల్ తలాక్ బిల్లుపై తెరాస వైఖరి ఏమిటో?

December 31, 2018


img

ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్‌సభలో ఆమోదింపజేసుకొన్న మోడీ సర్కారు నేడు రాజ్యసభలో ఆమోదం కోసం ప్రవేశపెట్టింది. వివాదస్పదమైన ఈ బిల్లుపై ముందుగా సభలో ఓటింగ్ జరిపిన తరువాతే చర్చ చేపట్టాలని, దీనిని జాయింట్ సెలక్షన్ కమిటీకి పంపించాలని కాంగ్రెస్ మిత్రపక్షాలు గట్టిగా పట్టు పడుతున్నాయి. కానీ మోడీ సర్కారు అందుకు అంగీకరించకపోవడంతో ఊహించినట్లుగానే కాంగ్రెస్ మిత్రపక్షాలు దానిని అడ్డుకొనేందుకు సభాకార్యక్రమాలను స్థంభింపజేయడంతో రాజ్యసభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. ఈ పరిణామాలు అందరూ ఊహించినవే. 

రాజ్యసభలో బిజెపికి 73 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 50, అన్నాడిఎంకె పార్టీకి 13, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ 13, తెరాస 6,    టిడిపి 6, వైకాపా 2, బిజెడి 9, జనతాదళ్ 6, సమాజ్ వాదీ 16, ఆర్.జెడి 5, డీఎంకే 5 మంది ఎంపీలున్నారు. వీరు కాక వివిద పార్టీలకు చెందినవారున్నారు. వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ పార్టీకి, మిగిలినవారు బిజెపికి మిత్రపక్షాలుగా ఉన్నారు. కనుక రాజ్యసభలో ఓటింగ్ జరిగితే అన్నాడిఎంకే, తెరాస, వైకాపా, బిజెడి వంటి న్యూట్రల్ పార్టీల మద్దతు అవసరం ఉంది. 

గతంలో ఇటువంటి అత్యవసరం సమయాలలో మోడీ సర్కారుకు తెరాస అండగా నిలబడింది. కానీ ఇప్పుడు ఒకపక్క కాంగ్రెస్, బిజెపిలకు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానని చెపుతూ, మరోపక్క ఈ బిల్లుకు మద్దతు పలికితే కేసిఆర్ విశ్వసనీయత మళ్ళీ ప్రశ్నార్ధకంగా మారుతుంది. కాంగ్రెస్ పార్టీకి దాని మిత్రపక్షాలను దూరం చేసి లోక్‌సభ ఎన్నికలలో దెబ్బ తీసి మోడీని మళ్ళీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు సిఎం కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన తెరపైకి తీసుకువచ్చారని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వాదనలకు కూడా బలం చేకూరుతుంది. అదీగాక మిత్రపక్షమైన మజ్లీస్ దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది. కనుక ఈ బిల్లుపై ఒకవేళ సభలో ఓటింగ్ జరిగినట్లయితే, తెరాస సభ్యులు రాజ్యసభ నుంచి వాక్ అవుట్ చేయడం ద్వారా కర్ర విరగకుండా పాము చావకుండా అన్నట్లు తప్పించుకొనే ప్రయత్నం చేసే అవకాశం ఉంది.


Related Post