కేసిఆర్-బాబు మద్య యుద్దాలెందుకు?

December 31, 2018


img

తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసిఆర్ మద్య యుద్ధాలు జరిగేవి. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులతో అవి పతాకస్థాయికి చేరుకున్నాయి. ఆ తరువాత కొందరు పెద్దల చొరవతో ఇద్దరూ వెనక్కు తగ్గారు. కానీ మళ్ళీ అసెంబ్లీ ఎన్నికల తరువాత వారిరువురి మద్య మాటలయుద్దాలు మొదలయ్యాయి. 

రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను ఫిరాయిపులతో మళ్ళీ కోలుకోలేని విధంగా నిర్వీర్యం చేశానని భావించిన కేసిఆర్ కు అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, టిడిపిలు పొత్తులు పెట్టుకొని ప్రజాకూటమి ఏర్పాటు చేసుకొని తెరాసకు సవాలు విసరడం పెద్ద షాక్ ఇచ్చాయి. నిజానికి ఎన్నికలలో ఏ పార్టీ దేనితోనైనా పొత్తులు పెట్టుకోవచ్చు. అది వాటి అంతర్గత వ్యవహారం. సిపిఎం నేతృత్వంలో 28 పార్టీలు పొత్తులు పెట్టుకొని బిఎల్ఎఫ్ ను ఏర్పాటు చేసుకొంటే దానిని ఏమాత్రం పట్టించుకోని కేసీఆర్, కాంగ్రెస్-టిడిపిల పొత్తులను తనపై యుద్ధంగానే భావించి ఎదుర్కొన్నారు. రాష్ట్రంలో తెరాసను మళ్ళీ అధికారంలోకి రాకుండా అడ్డుకొనేందుకే చంద్రబాబునాయుడు చేసిన కుట్రగా సిఎం కేసీఆర్ భావించడంతో ఈ యుద్దం మొదలైందని చెప్పవచ్చు. పైగా ఎన్నికలలో ప్రచార సందర్భంగా చంద్రబాబునాయుడు హైదారాబాద్ వచ్చి తెరాస పాలనపై తీవ్ర విమర్శలు చేయడం కేసిఆర్ ఆగ్రహం కలిగించడం సహజం. అయితే కేసిఆర్ అందుకు తగిన ప్రతివ్యూహంతో ప్రజాకూటమిని ఎదుర్కొని ఓడించారు. 

అప్పటి నుంచే ఆయన చంద్రబాబునాయుడుపై తీవ్ర ప్రతీకరేచ్చతో రగిలిపోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో వేలు పెట్టినందుకుగాను తాను కూడా ఏపీ వ్యవహారాలలో వేలు పెట్టి చంద్రబాబుకు ‘రిటర్న్ గిఫ్ట్’ ఇస్తానని హెచ్చరించారు. దానిని చంద్రబాబు, టిడిపి నేతలు స్వాగతించారు. అయితే హైకోర్టు విభజన విషయంలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై సిఎం కేసిఆర్ మళ్ళీ తీవ్రస్థాయిలో చంద్రబాబుపై విమర్శలు గుప్పించడంతో ఆయన కూడా అదే స్థాయిలో జవాబులీయడం మొదలుపెట్టారు.

అయితే ఇప్పుడు వారి మద్య కొనసాగుతున్న ఈ యుద్దానికి మరో కారణం కూడా కనిపిస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేసిఆర్ ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసినప్పటికీ వారు స్పందించక పోవడంతో ఆ ఉక్రోషంతో తనను విమర్శిస్తున్నారని చంద్రబాబునాయుడు వాదిస్తున్నారు. అది కొంతవరకు నిజమేనని చెప్పవచ్చు. ఇదివరకు కేసిఆర్ కలిసిన దేవగౌడ, మమతా బెనర్జీ, స్టాలిన్ తదితరులు చంద్రబాబుతో చేతులు కలిపి కాంగ్రెస్ నేతృత్వంలో బిజెపిని ఎదుర్కొనేందుకు ముందుకు వస్తున్నారు. ఈవిధంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం కేసిఆర్ చేస్తున్న ప్రయత్నాలకు చంద్రబాబునాయుడు గండికొడుతున్నారు కనుక ఇది కూడా కేసిఆర్ ఆగ్రహానికి మరో కారణమై ఉండవచ్చు.


Related Post