కేసిఆర్...చంద్రబాబు మళ్ళీ డిష్యూమ్ డిష్యూమ్

December 31, 2018


img

తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసిఆర్ మద్య యుద్ధాలు జరిగేవి. ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులతో అవి పతాకస్థాయికి చేరుకున్నాయి. ఆ తరువాత కొందరు పెద్దల చొరవతో ఇద్దరూ వెనక్కు తగ్గారు. కానీ మళ్ళీ వారిరువురి మద్య మాటలయుద్దాలు మొదలయ్యాయి. కారణాలు అందరికీ తెలిసినవే. 

ఇప్పటివరకు తెలంగాణ సిఎం కేసీఆర్ తనపై ఎన్ని విమర్శలు, ఆరోపణలు చేసినా మౌనం వహిస్తుండే ఏపీ సిఎం చంద్రబాబునాయుడు, ఇప్పుడు కేసిఆర్ కు అదే స్థాయిలో ఘాటుగా జవాబులు చెపుతుండటం విశేషం. 

కేసిఆర్ తనపై చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు స్పందిస్తూ, “హైటెక్ సిటీకి ఎవరు పునాది వేశారో అందరికీ తెలుసు. దేశానికి ఐ‌టిరంగాన్ని తీసుకువచ్చింది స్వర్గీయ రాజీవ్ గాంధీయే. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు జనార్ధన్ రెడ్డి ముఖ్యమంత్రిగా లేరనే సంగతి కేసిఆర్ కు తెలియదా?మరి ఆయన హయంలో పునాది వేశారని కేసిఆర్ ఏవిధంగా చెపుతున్నారు? 

ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనలపై ఏమీ మాట్లాడకపోవడంతో ఆ ఉక్రోషంతో నాపై నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నోరుంది కదా అని...ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు.    కేసిఆర్ ఏదో రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఇటువంటి బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు భయపడేవాడిని కాను. కేసిఆర్ మీద టెలిఫోన్ ట్యాపింగ్ వంటి కేసులున్నాయి. గతంలో ఓ కేసులో ప్రధాని మోడీ కేసిఆర్ ను కాపాడకపోయుంటే ఆయన ఇప్పుడు ఎక్కడ ఉండేవారో తెలుసుకొంటే మంచిది. అయినా జగన్మోహన్ రెడ్డి, బిజెపిలతో చేతులు కలిపిన కేసిఆర్ మాకు ఇప్పటికే పంపిన రిటర్న్ గిఫ్ట్స్ చాలానే ఉన్నాయి. ఇక్కడి వైకాపా నేతలకు తెలంగాణలో కాంట్రాక్టులు, డబ్బు ఇస్తున్న మాట నిజమా కాదా? అవన్నీ రిటర్న్ గిఫ్ట్ లో భాగమే కదా? 

ఒకపక్క మోడీతో, మరోపక్క జగన్ తదితరులతో రహస్య సంబందాలు కొనసాగిస్తూ డొంక తిరుగుడు రాజకీయాలు చేస్తూ, నేను నీచ రాజకీయాలు చేస్తున్నాన్నంటూ కేసిఆర్ నాపై విమర్శలు చేస్తుండటం సిగ్గుచేటు. మోడీని కేసీఆర్ నెత్తిన పెట్టుకుంటే మాకేం నష్టంలేదు. అయినా ఈ ముసుగులో గుద్దులాటలు ఎందుకు? కేసిఆర్ కు నిజంగా దమ్ముంటే మోడీ, జగన్ ఇంకా ఎవరెవరున్నారో అందరితో కలిసి ఏపీలో పోటీ చేయమనండి. ఎవరు వద్దన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడైనా ప్రచారం చేయొచ్చు. ఎంతమంది కలిసొచ్చినా నన్ను టిడిపిని ఎవరూ ఏమీ చేయలేరు. 

ఎన్టీఆర్ నుంచి నేను తెలుగుదేశం పార్టీని లాకొన్నానని అంటున్నారు. కానీ వైస్రాయ్ హోటల్ పధకానికి వ్యూహరచన చేసింది కేసిఆరే కదా? కేసిఆర్ తన వైఫల్యాలను కప్పి పుచ్చుకోవడానికే నాగురించి ఈవిధంగా మాట్లాడుతున్నారు. కానీ ఎల్లకాలం ప్రజలను ఇటువంటి మాటలతో మభ్యపెట్టలేరనే సంగతి గ్రహిస్తే మంచిది,”” అని చంద్రబాబునాయుడు అన్నారు. 


Related Post