తెలంగాణ పోలిటికల్ రౌండ్-అప్:2018

December 28, 2018


img

 మరో 3 రోజులలో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాము. ఈ సందర్భంగా 2018 రాజకీయాలు ఏవిధంగా సాగాయో ఓసారి వెనక్కు తిరిగి చూసుకొంటే, ఈ ఏడాదిలో రాష్ట్రానికి సంబందించి సెప్టెంబరు 6న శాసనసభ రద్దు, ముందస్తు ఎన్నికలు, ప్రజాకూటమి ఏర్పాటు, ఎన్నికలలో తెరాస విజయం సాధించడం ప్రధానమైన రాజకీయ పరిణామాలుగా కనిపిస్తాయి. 

ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు వినిపించిన అనేక విమర్శలకు సిఎం కేసీఆర్‌ ఎన్నికల ఫలితాలతో సమాధానం చెప్పారు. అయితే 100కు పైగా సీట్లు సాధిస్తామని చెప్పినప్పటికీ కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇవ్వడంతో 88 స్థానాలతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది.

గత నాలుగేళ్లలో అటు ప్రభుత్వంలో ఇటు పార్టీలో తన సమర్ధత నిరూపించుకొన్న కేటీఆర్ ఈ ఏడాది రాజకీయంగా మరో మెట్టు పైకి ఎక్కారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ఆయన తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. దీని తరువాత ఆయన మరొక్క మెట్టు మాత్రమే ఎక్కవలసి ఉంది. బహుశః 2019లో ఆ చివరి మెట్టు కూడా ఎక్కేస్తారేమో? 

గత నాలుగేళ్ళలో తెరాస ప్రభుత్వంతో నిరంతరం పోరాడుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, టిడిపి,టిజేఎస్, సిపిఐలతో కలిసి ప్రజాకూటమిని ఏర్పాటు చేసింది. దాంతో తెరాసకు చాలా గట్టి పోటీయే ఇవ్వగలిగింది. కానీ టిడిపితో పొత్తు కాంగ్రెస్ పార్టీ కొంప ముంచింది. ఒకవేళ టిడిపితో పొత్తులు పెట్టుకోకుండా ఒంటరిగా ఎన్నికలకు వెళ్ళి ఉండి ఉంటే, మరింత మెరుగైన ఫలితాలు సాధించి ఉండేదేమో? 

జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డికె అరుణ వంటి హేమాహేమీలందరూ ఓడిపోవడంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశ నిస్పృహలు, స్తబ్దత ఏర్పడ్డాయి. కానీ అది మళ్ళీ పుంజుకోవడానికి దాని ముందు రెండు మంచి అవకాశాలున్నాయి. 1. పంచాయతీ ఎన్నికలు. 2. లోక్‌సభ ఎన్నికలు. వీటిలో అది తెరాసపై పైచేయి సాధించగలిగితే రాష్ట్రంలో అది మనుగడ సాగించగలదు. లేకుంటే వచ్చే ఎన్నికలనాటికి రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ అదృశ్యమైపోయినా ఆశ్చర్యం లేదు. 

ఇక ఈ ఏడాదిలోనే ప్రొఫెసర్ కోదండరాం ప్రత్యక్ష రాజకీయాలలోకి ప్రవేశించి తెలంగాణ జనసమితి పార్టీ (టిజెఎస్)ని ఏర్పాటు చేశారు. ఆయన పట్ల ప్రజలకు నేటికీ ఎంతో కొంత గౌరవం ఉంది కానీ తెరాసను కాదని టిజెఎస్ ను గెలిపించేంత కాదని ఆయన గుర్తించలేకపోయారు. ముందు చెప్పినట్లుగా టిజెఎస్ ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేసి ఉండి ఉంటే ఫలితం ఏవిధంగా ఉండేదో కానీ కాంగ్రెస్, టిడిపిలతో చేతులు కలపడంతో వాటిపై ప్రజలకున్న వ్యతిరేకత టిజెఎస్ కు కూడా బదలాయించబడటంతో తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు టిజెఎస్ ఇంకా కొనసాగుతుందో లేదో తెలియని స్థితిలో ఉంది. 

సిపిఐ, టిజెఎస్ పార్టీలు కాంగ్రెస్, టిడిపిలతో కాక సిపిఎం అధ్వర్యంలో ఏర్పడియన్ బిల్ఎఫ్ లో చేరి ఉండి ఉంటే మెరుగైన ఫలితాలు వచ్చి ఉండేవేమో? 

ప్రజాకూటమి ప్రయోగంలో ఎదురైన ఇబ్బందులను కాంగ్రెస్, టిడిపిలు అధిగమించగలగడంతో జాతీయస్థాయిలో కూడా కాంగ్రెస్ నేతృత్వంలో ఇదేవిధంగా కూటమి ఏర్పాటుకు సన్నాహాలు మొదలుపెట్టాయి. సిఎం కేసీఆర్‌ కూడా కాంగ్రెస్, బిజెపీలకు ప్రత్యామ్నాయంగా దేశంలో ప్రాంతీయ పార్టీలతో కలిసి కూటమి ఏర్పాటుకు చురుకుగా ప్రయత్నాలు చేస్తున్నారు. 

ఇక ఈ ఎన్నికలలో ప్రజాకూటమి గెలిచి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చక్రం తిప్పాలను కొన్న సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డికె అరుణ, జీవన్ రెడ్డి, షబ్బీర్ ఆలీ వంటి వారందరూ ఓటమి పాలవడంతో వారి వ్యక్తిగత రాజకీయ జీవితంతో పాటు కాంగ్రెస్ పార్టీ రాజకీయ భవిష్యత్ కూడా ప్రశ్నార్ధకంగా మారిందని చెప్పకతప్పదు.

నిజానికి ఈ ఏడాదిలో ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆత్మవిశ్వాసంతో...సమరోత్సాహంతో ఉండేది కానీ ఒకే ఒక ఎన్నికలతో ఏడాది ముగిసే సమయానికి దాని ఉనికి ప్రశ్నార్ధకంగా మారడం విశేషం. అదే సమయంలో రాష్ట్రంలో తెరాస తిరుగులేని పార్టీగా, రాజకీయ శక్తిగా అవతరించింది. ముఖ్యంగా రాష్ట్రంలో మరింత రాజకీయ సుస్థిరత, మరింత సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పడ్డాయి. దీని వలన 2019 లో తెలంగాణ రాష్ట్రాభివృద్ధి మరింత వేగం పుంజుకొనే అవకాశం ఉంది. తెలంగాణ ప్రజలు ఎటువంటి సందిగ్ధం లేకుండా తీర్పు చెప్పారు కనుక ఈ క్రెడిట్ వారికే చెందుతుంది.


Related Post