ట్రిపుల్ తలాక్ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

December 27, 2018


img

వివాదాస్పద ట్రిపుల్ తలాక్ బిల్లుకు నేడు లోక్‌సభ ఆమోదం తెలిపింది. కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్  ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టిన తరువాత దీనిపై అధికార ప్రతిపక్ష సభ్యుల మద్య వాడివేడిగా వాదోపవాదాలు సాగాయి. కాంగ్రెస్ పార్టీ ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించింది. అన్నాడిఎంకె సభ్యులు కూడా దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మజ్లీస్ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్రిపుల్ తలాక్ బిల్లుకు కొన్ని సవరణలు ప్రతిపాదించినప్పటికీ అవి వీగిపోయాయి. ఈ బిల్లుపై నిరసన తెలియజేస్తూ కాంగ్రెస్, అన్నాడిఎంకె సభ్యులు ఓటింగ్ సమయంలో సభలో నుంచి వాకవుట్ చేశారు. బిల్లుపై ఓటింగ్ జరిపినప్పుడు బిల్లుకు అనుకూలంగా 245 మండి వ్యతిరేకంగా 11 మండి ఓటు వేయడంతో ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్‌సభ ఆమోదం పొందినట్లు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. 

ట్రిపుల్ తలాక్‌ను నిషేదిస్తూ కేంద్రప్రభుత్వం గత ఏడాది సెప్టెంబరులో ఆర్డినెన్స్ జారీ చేసింది. దానిని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు స్పందిస్తూ అది తాత్కాలికంగా ఆరునెలలపాటు అమలులో ఉంటుందని, ఆ తరువాత కేంద్రప్రభుత్వం పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించవలసి ఉంటుందని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు సూచించినట్లుగానే నేడు కేంద్రప్రభుత్వం లోక్‌సభ చేత ట్రిపుల్ తలాక్‌ బిల్లును ఆమోదింపజేసుకొంది. ఇక రాజ్యసభలో కూడా ఆమోదం పొందవలసి ఉంది.  

ఈ బిల్లు ప్రకారం ఎవరైనా ముస్లిం వ్యక్తి మూడుసార్లు తలాక్ చెప్పి తన భార్యను విడిచిపెట్టేసినట్లయితే ఇకపై నేరంగా పరిగణించబడుతుంది. అందుకుగాను ఆ వ్యక్తికి మూడేళ్లు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది. విశేషమేమిటంటే, ముస్లిం దేశాలైన సౌదీ అరేబియా, ఇరాన్, లెబనాన్, సూడాన్, కువైట్, యూఏఈ, జోర్డాన్, లిబియా, బంగ్లాదేశ్, మలేషియా తదితర 22 దేశాలలో చాలా ఏళ్ళ క్రితమే ట్రిపుల్ తలాక్‌ను నిషేదించాయి. మన పొరుగునే ఉన్న పాకిస్థాన్‌ 1962లోనే ట్రిపుల్ తలాక్‌ను నిషేదించింది. కానీ భారతదేశంలో ఇప్పుడు దానిపై నిషేదం విదించబోతుంటే, వివిద రాజకీయ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుండటం విస్మయం కలిగిస్తుంది. ముస్లిం మహిళల జీవితాలకు భద్రత కల్పించడం కోసమే ఈ బిల్లును ప్రవేశపెట్టమని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.


Related Post