హైకోర్టులో ఏపీ న్యాయవాదుల ఆందోళన

December 27, 2018


img

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును విభజిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అవడంతో హైకోర్టులో పనిచేస్తున్న ఏపీ న్యాయవాదులు ఈరోజు ఉదయం నుంచి హైకోర్టు వ్యవహారాలను అడ్డుకొంటు నిరసనలు తెలియజేస్తున్నారు. ఏపీలో ఇంకా కోర్టు భవనాలు సిద్దం కాకముందే జనవరి 1వ తేదీ నుంచి అక్కడకు వెళ్ళిపోవాలని ఉత్తర్వులు జారీ చేయడాన్ని వారు తప్పు పడుతున్నారు. తగినంత సమయం ఇవ్వకుండా ఉమ్మడికోర్టును విభజించడం వలన కేసుల విభజన, సిబ్బంది విభజనలో సమస్యలు తలెత్తుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారందరూ నేడు హైకోర్టు ప్రధానన్యాయమూర్తిని టిబి రాధాకృష్ణన్ ను కలిసి తమ అభ్యంతరాలు తెలిపారు. హైకోర్టు విభజనకు అన్ని ఏర్పాట్లు  పూర్తయిన తరువాతే ఏపీకి హైకోర్టు తరలింపు మొదలుపెట్టాలని కోరారు. 

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు వేరుపడి సుమారు నాలుగున్నరేళ్లు పూర్తికావస్తోంది. అప్పటి నుంచి హైకోర్టు విభజనకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ కొన్ని కారణాల వలన ఆలస్యం జరుగుతోందని నేడు నిరసన తెలియజేస్తున్న ఏపీ న్యాయవాదులకు కూడా తెలుసు. అలాగే అమరావతిలో యుద్దప్రాతిపదికన తాత్కాలిక హైకోర్టు భవనసముదాయాలు, సిబ్బంది గృహసముదాయాలు నిర్మించబడుతున్నాయని, జనవరిలోగా హైకోర్టు విభజన జరుగబోతోందని కూడా వారికి తెలుసు. కానీ హడావుడిగా హైకోర్టు విభజన జరుగుతోందంటూ వారు వాదించడం హాస్యాస్పదంగా ఉంది. అమరావతికి తరలివెళ్ళేందుకు వారు ఇష్టపడకపోవడానికి వారు చెపుతున్న కారణాలు సహేతుకమైనవే కాని వారి వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. 

చిరకాలంగా హైదరాబాద్ లో స్థిరపడినందున అక్కడ వారికున్న వృత్తిపరమైన సంబంధాలు, కోర్టు లావాదేవీలు లేదా వ్యవహారాలు, పలుకుబడి, పిల్లల చదువులు, కుటుంబ సభ్యుల ఉద్యోగాలు, అభివృద్ధి చెందిన నగరజీవనానికి అలవాటుపడి ఉండటం వంటి అనేకానేక కారణాలుండవచ్చు. ఒకప్పుడు హైదరాబాద్ లో స్థిరపడిన ఏపీ సచివాలయ సిబ్బంది కూడా అమరావతి తరలివెళ్ళేందుకు ఈవిధంగానే అభ్యంతరాలు చెప్పేవారు. కానీ చివరికి తరలివెళ్ళక తప్పలేదు. హైకోర్టు విభజన అనివార్యమని తెలిసి ఉన్నప్పుడు ఏపీ న్యాయవాదులు అమరావతి తరలివెళ్ళేందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకొని సిద్దపడాలి తప్ప విభజన తరువాత కూడా ఇంకా హైదరాబాద్ లోనే పనిచేయాలనుకోవడం తగదు. 


Related Post