కేసీఆర్‌ ప్రయత్నాలు ఫలించనున్నాయా?

December 27, 2018


img

కాంగ్రెస్, బిజెపీలకు ప్రత్యామ్నాయంగా సిఎం కేసీఆర్‌ ఏర్పాటు చేయాలనుకొంటున్న ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదనలకు మొదటిసారిగా యూపిలోని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ సానుకూలంగా స్పందించారు. ఆయన నిన్న లక్నోలో మీడియాతో మాట్లాడుతూ,“ కాంగ్రెస్, బిజెపీలకు ప్రత్యామ్నాయంగా దేశంలో బలమైన ప్రత్యామ్నాయ రాజకీయకూటమి అవసరం చాలా ఉంది. దానికోసం కృషి చేస్తున్న తెలంగాణ సిఎం కేసీఆర్‌ను నేను అభినందిస్తున్నాను. ఈనెల 25-26 తేదీలలో నేను ఆయనను డిల్లీలో కలవాలనుకున్నాను. కానీ ఇక్కడ అత్యవసర పనులున్నందున ఆయనను కలవలేకపోయాను. కనుక త్వరలోనే నేను హైదరాబాద్ వెళ్ళి ఆయనను కలుస్తాను. ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరేందుకు మాపార్టీ చాలా ఆసక్తిగా ఉంది,” అని చెప్పారు. 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అతిపెద్ద పార్టీలైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ), బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బిఎస్పీ)లు చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుండేవి. యూపి అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీలు రెండూ కలిసే పోటీ చేశాయి కానీ బిజెపీ చేతిలో ఓడిపోయాయి. 

ఆ తరువాత యూపిలో బద్దవిరోదులైన ఎస్పీ, బిఎస్పీలు రెండూ క్రమంగా దగ్గరవుతూ వచ్చాయి. కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటవుతున్న కూటమిలోనే అవి చేరాలని మొదట భావించినప్పటికీ, ప్రధానమంత్రి పదవి విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చకపోవడంతో దానికి దూరంగా జరిగాయి. త్వరలో జరుగబోయే లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని దూరంగా పెట్టి అవి రెండూ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ కంగు తింది. 

ఎస్పీ, బిఎస్పీలు రెండూ ఇప్పుడు దోస్తులు కనుక ఎస్పీతో పాటు బీఎస్పీ కూడా ఫెడరల్‌ ఫ్రంట్‌లో చేరడం ఖాయమనే భావించవచ్చు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపిలో 80 ఎంపీ సీట్లున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో బిజెపీ అధికారంలో ఉన్నప్పటికీ, యూపీ సిఎం యోగీ ఆదిత్యనాథ్ వైఖరితో అప్పుడే అక్కడి ప్రజలలో బిజెపీ పట్ల వ్యతిరేకత కనబడుతోంది. కనుక లోక్ సభ ఎన్నికలలో ఎస్పీ, బిఎస్పీలు అత్యధిక సీట్లు గెలుచుకొనే అవకాశాలున్నాయి. అదేకనుక జరిగితే ఫెడరల్‌ ఫ్రంట్‌లో యూపీ, తెలంగాణ, ఏపీ (జగన్ పార్టీ ద్వారా) రాష్ట్రాలలో కలిపి కనీసం 75-85 ఎంపీలు ఉంటారు. ఒకవేళ లోక్ సభ ఎన్నికలలోగా ఓడిశా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు ఏవైనా ఫెడరల్‌ ఫ్రంట్‌లో కలిసేందుకు ముందుకు వస్తే దాని బలం మరింత పెరుగుతుంది. ఫెడరల్‌ ఫ్రంట్‌లోని అన్ని ప్రాంతీయ పార్టీలు కలిసి లోక్ సభ ఎన్నికలలో 100-150 సీట్లు గెలుచుకోగలిగితే అప్పుడు సిఎం కేసీఆర్‌ చెప్పినట్లు కేంద్రాన్ని ఫెడరల్‌ ఫ్రంటే శాశించవచ్చు లేదా కేంద్రంలో అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదు.


Related Post