చాడా వెంకటరెడ్డి రాజీనామాకు సిద్దం?

December 26, 2018


img

తెలంగాణ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్దం అయినట్లు తాజా సమాచారం. సిపిఐకి రాష్ట్రంలో మంచి బలమున్నప్పటికీ ఒంటరిగా పోటీ చేయకుండా అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకొని కేవలం మూడు స్థానాలలోనే పోటీ చేయడంవలననే సిపిఐకి తీరని నష్టం జరిగిందని ఆ పార్టీలో కొందరు సీనియర్లు వాదిస్తున్నారు. 

పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా వ్యవహరిస్తున్న చాడా వెంకటరెడ్డి పార్టీ ప్రయోజనాలను పట్టించుకోకుండా ప్రజాకూటమిలో తనకు సీటు దక్కించుకోవడానికే ప్రయత్నించారని, ఆ తరువాత ఆయన మిగిలిన రెండు నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న పార్టీ అభ్యర్ధులను పట్టించుకోకుండా తన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికే పరిమితమవడం వలన ఈసారి సిపిఐ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయిందని పార్టీలో కొందరు వాదిస్తున్నారు. కనుక ఆయన పార్టీ ఓటమికి బాధ్యత వహించాలని పట్టుబడుతున్నట్లు సమాచారం. పార్టీలో వ్యతిరేకతను చూసి తీవ్ర మనస్తాపం చెందిన చాడా వెంకటరెడ్డి రాజీనామాకు సిద్దపడినట్లు తెలుస్తోంది. 

త్వరలో జరుగబోయే పంచాయతీ ఎన్నికలలో సిపిఐ అభ్యర్ధులు ఒంటరిగానే పోటీ చేయాలని నిర్ణయించినట్లు తాజా సమాచారం.   

టిడిపితో పొత్తు పెట్టుకోవడం వలననే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని కొందరు కాంగ్రెస్ నేతలు వాదిస్తుంటే, కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకోవడం వలన సిపిఐ ఓడిపోయిందని ఆ పార్టీలో నేతలు భావిస్తుండటం విశేషం. అలాగే ప్రజాకూటమిలో చేరి పొరపాటు చేశామని టిజేఎస్ భావిస్తోంది. మొత్తం మీద ప్రజాకూటమిలో నాలుగు పార్టీలు తమ పొత్తులు అనైతికమని, నిష్ప్రయోజకరమైనవని అంగీకరించినట్లే ఉన్నాయి. 


Related Post