కేసీఆర్‌కు మోడీ సహకరిస్తారా?

December 26, 2018


img

రాష్ట్రాలకు కొత్తగా ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టినవారు డిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని మర్యాదపూర్వకంగా కలవడం ఆనవాయితీగా వస్తోంది. కనుక ఇటీవల రెండవసారి తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన  కేసీఆర్‌ బుదవారం సాయంత్రం 4 గంటలకు ప్రధాని నరేంద్రమోడీని మర్యాదపూర్వకంగా కలువబోతున్నారు. ఈ సందర్భంగా ఆయన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా కల్పించడం, రక్షణభూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయింపు, విభజన హామీల అమలు, పెండింగ్ నిధుల విడుదల తదితర అంశాల గురించి ప్రధాని మోడీకి మరోసారి విజ్ఞప్తి చేయబోతున్నారు.

అయితే ఒకపక్క కాంగ్రెస్, బిజెపీలకు ప్రత్యామ్నాయంగా కూటమిని ఏర్పాటు చేసేందుకు సిఎం కేసీఆర్‌ డిల్లీలోనే కూర్చొని తనను గద్దె దించడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఆయనకు ప్రధాని మోడీ సహకరిస్తారా? అంటే అనుమానమే. 

కేసీఆర్‌ తనను గద్దె దించడానికి ప్రయత్నాలు చేస్తున్నా ప్రధాని మోడీ వాటిని పట్టించుకోకుండా కేసీఆర్‌కు సహకరించినట్లయితే మోడీ-కేసీఆర్‌ మద్య రహస్య అవగాహన ఉందనే కాంగ్రెస్ వాదనలకు బలం చేకూరుతుంది. వచ్చే లోక్ సభ ఎన్నికలలో బిజెపీని గెలిపించేందుకే కేసీఆర్‌ కూటమి పేరుతో కాంగ్రెస్ మిత్రపక్షాలను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ ఆరోపించారు.

ఆ కారణం చేత కేసీఆర్‌ విజ్ఞప్తులను ప్రధాని నరేంద్రమోడీ పట్టించుకోనట్లయితే, తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందంటూ లోక్ సభ ఎన్నికలలో దీనినే తెరాస ప్రధానాస్త్రంగా ఉపయోగించుకోవడం ఖాయం. కనుక ఏవిధంగా చూసినా వారిద్దరికీ ఇది ఇబ్బందికరమైన పరిస్థితే అని చెప్పవచ్చు. 


Related Post