వాటిని కూడా వాడేసుకొంటున్నాయా?

December 25, 2018


img

“కుక్కపిల్ల..సబ్బుబిళ్ళ... కాదేదీ కవితకు అనర్హం అన్నారు” మహాకవి శ్రీశ్రీ ఆనాడు. దేశంలో రాజకీయ పార్టీలు కూడా అదే ఫార్ములాను ఫాలో అయిపోతున్నాయి. ‘కులమూ..మతమూ..ప్రాంతమూ.. బాష... కావేవీ రాజకీయాలకు అనర్హం’ అంటున్నాయి. 

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు, పంచాయతీ ఎన్నికల సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై జరుగుతున్న రాజకీయాలను చూసినప్పుడు శ్రీశ్రీ కవితను మన రాజకీయ పార్టీలు ఎంత చక్కగా ఫాలో అయిపోతున్నాయో అనిపించకమానదు. ఈ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, తెరాస రెండూ రాజకీయాలు చేస్తున్నాయని చెప్పక తప్పదు. 

తెలంగాణలో జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు అమలుచేయాలనుకొంటున్నామని, కనుక ముస్లింలకు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ తెరాస అసెంబ్లీలో ఒక తీర్మానం చేసి కేంద్రానికి పంపించి చేతులు దులుపుకొంది. అదేవిధంగా పంచాయతీ ఎన్నికలలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించింది. 

కానీ అన్నీ వర్గాలకు కలుపుకొని 50 శాతంకు మించి రిజర్వేషన్లు ఇవ్వకూడదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, ఈ విషయంలో కేంద్రప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలనే పాటిస్తుందని సిఎం కేసీఆర్‌కు తెలియదనుకోలేము. అయినప్పటికీ రిజర్వేషన్ల పెంపు ప్రతిపాదనలు చేసి ఆయా వర్గాలలో ఆశలు రేకెత్తించారు. ఊహించినట్లుగానే ముస్లింలకు రిజర్వేషన్ల శాతం పెంపును కేంద్రం అంగీకరించబోదని సాక్షాత్ ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారంలో తెగేసి చెప్పారు. అప్పుడు  కేసీఆర్‌ కూడా ఊహించినట్లుగానే తాము ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలనుకున్నానని, కానీ కేంద్రప్రభుత్వం, సుప్రీంకోర్టు మోకాలు అడ్డాయని, లోక్ సభ ఎన్నికలలో తెరాసకు 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి రిజర్వేషన్లు సాధిస్తానని చెప్పి అసెంబ్లీ ఎన్నికల పరీక్షలో గట్టెక్కేశారు. 

బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా నెపాన్ని కేంద్రప్రభుత్వం, సుప్రీంకోర్టులపై త్రోసి యధాప్రకారం బీసీలకు 22.79 శాతం రిజర్వేషన్లు కేటాయిస్తూ ఆర్డినెన్స్ జారీ చేసేరు. ఇది తమను నమ్మించి మోసం చేయడమేనని బీసీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల అంశంపై  కేసీఆర్‌ అధికారంలోకి రాగానే మాటమార్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇక 50 శాతంకు మించి రిజర్వేషన్లు ఇవ్వడానికి వీలులేదని, సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం రెండూ అందుకు అంగీకరించవని కాంగ్రెస్ పార్టీకి కూడా బాగా తెలుసు. కానీ ముస్లింలకు 12 శాతం, బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తద్వారా తెరాసను ప్రజల ముందు దోషిగా నిలబెట్టి సున్నితమైన ఈ అంశం ద్వారా ఎంతో కొంత రాజకీయలబ్ధి పొందాలని వారి ఆశ. ఈవిధంగా అధికార, ప్రతిపక్షపార్టీలు ప్రతీ అంశాన్ని కేవలం రాజకీయకోణంలో నుంచి మాత్రమే చూస్తూ, వాటిని తమ రాజకీయలబ్ధికి ఉపయోగించుకోవాలని ప్రయత్నిస్తుండటం శోచనీయం. 


Related Post