కేసీఆర్‌ బాగానే గుర్తించారు

December 15, 2018


img

గత నాలుగేళ్ళలో తెరాస సర్కార్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పధకాల కారణంగా ఈ ఎన్నికలలో పూలనావలా సాగిపోతూ అలవోకగా విజయం సాధించవలసిన తెరాస, ప్రజాకూటమి నుంచి వచ్చిన గట్టి పోటీని తట్టుకొని విజయం సాధించడానికి చాలా చెమటోడ్చవలసి వచ్చింది. తప్పనిసరి పరిస్థితులలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంటును కూడా వాడుకోవలసి వచ్చింది. ఇంతకాలం గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోకపోవడం వలననే ఇంత శ్రమపడవలసి వచ్చిందని సిఎం కేసీఆర్‌ బాగానే గుర్తించారు. అందుకే ఈసారి పార్టీ బాధ్యతలను కేటిఆర్‌కు అప్పగించి, పార్టీ బలోపేతానికి గతంలో ఆయన చేసిన సూచనలను, సలహాలను అమలుచేయడానికి ఆమోదం తెలిపారు. 

తెలంగాణభవన్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో  కేటిఆర్‌ను తెరాస వర్కింగ్ ప్రెసిడెంటుగా నియమించిన తరువాత సిఎం కేసీఆర్‌ మాట్లాడుతూ, “పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసుకోవడానికి జిల్లాకొక పార్టీ కార్యాలయం నిర్మించుకోవాలి. తెరాస ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పనుల గురించి గ్రామస్థాయిలో పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రజలకు ఎప్పటికప్పుడు వివరిస్తూ ప్రజలను పార్టీకి మరింత చేరువ చేయాలి. పార్టీలో రాష్ట్రస్థాయి నేతలకు ప్రత్యేకంగా గుర్తింపు కార్డులు ఇస్తాము. వాటిని చూపించి వారు ఎప్పుడైనా నన్ను లేదా కేటిఆర్‌ లేదా ఇతర మంత్రులను నేరుగా కలువవచ్చు. ఇకపై ఎమ్మెల్యేలకు బదులు పార్టీ నేతలకే కార్పొరేషన్ పదవులు ఇస్తాము. నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు కాదు...పార్టీ నేతలే అన్నిటినీ శాశించే స్థాయికి ఎదగాలి. పార్టీని బలోపేతం చేసుకోవడానికి అందరం కలిసి కృషి చేద్దాము,” అని అన్నారు.

ప్రభుత్వాన్ని, పార్టీని ఒకే వ్యక్తి నడిపించడం వలన కొన్ని లాభాలు..కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. ముఖ్యమంత్రికి ప్రభుత్వ వ్యవహారాలతో తీరికలేకపోవడం వలన పార్టీపై దృష్టి పెట్టడం సాధ్యం కాదు. కనుక ఎన్నికలకు ముందు హడావుడిగా పార్టీపై దృష్టి పెట్టి అన్ని సరిదిద్దుకోవలసివస్తుంటుంది. ఈ సమస్యను కేసీఆర్‌ బాగానే గుర్తించారని స్పష్టం అవుతోంది. ఇకపై కేటిఆర్‌ పార్టీ వ్యవహారాలను చూసుకొంటారు కనుక మళ్ళీ వచ్చే ఎన్నికల నాటికి తెరాసను ఎవరూ డ్డీకొనలేనంత బలంగా మారవచ్చు. అదేకనుక జరిగితే వచ్చే ఎన్నికలు పూర్తిగా ఏకపక్షంగా సాగినా ఆశ్చర్యం లేదు. 



Related Post