సుప్రీం తీర్పు కాస్త ముందుగా వచ్చి ఉంటే...

December 14, 2018


img

రాఫెల్ యుద్దవిమానాల కొనుగోలులో మోడీ ప్రభుత్వం వేలకోట్లు అవినీతికి పాల్పడి అంబానీలకు లబ్ది చేకూరిందంటూ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పదేపదే ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. దానిపై సుప్రీంకోర్టు అధ్వర్యంలో విచారణ జరిపాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈరోజు తుది తీర్పు వెలువరించింది. 

దేశరక్షణకు ఎప్పటికప్పుడు ఆధునిక యుద్ద విమానాలు సమకూర్చుకోవడం చాలా అవసరమని, అలాగే దేశభద్రతకు సంబందించిన విషయాలలో గోప్యత కూడా చాలా అవసరమని, కనుక ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవలసిన అవసరం ఉందని తాము భావించడం లేదని సుప్రీంకోర్టు తెలిపింది. 2016 సెప్టెంబరులో ఈ యుద్దవిమానాల కొనుగోలుకు ఉభయదేశాల మద్య ఒప్పందాలు జరిగినప్పుడు ఎవరూ ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని, కానీ ఆ తరువాత ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు హోలన్ దీనిపై చేసిన కొన్ని వ్యాఖ్యలను ఆధారంగా చేసుకొని వివాదం సృష్టించినట్లు కనబడుతోందని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. రఫెల్ యుద్దవిమానాల కొనుగోలు చేయాలనే ప్రభుత్వ నిర్ణయం, దాని కోసం ఫ్రాన్స్ తో చేసుకొన్న అంతర్జాతీయ ఒప్పందం, విమాన ధరలు వంటి అంశాలలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోనవసరం లేదని భావిస్తున్నామని, కనుక కేంద్ర ప్రభుత్వం ఈ యుద్దవిమానాల కొనుగోలులో నిరభ్యంతరంగా ముందుకు వెళ్లవచ్చని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తన తీర్పులో పేర్కొన్నారు. 

సుప్రీంకోర్టు తీర్పు మోడీ ప్రభుత్వానికి క్లీన్ చిట్ వంటిదేనని అర్దమవుతోంది. కనుక ఇది బిజెపికి చాలా ఊరటనిస్తుందని వేరే చెప్పనవసరం లేదు. కానీ ఇదే తీర్పు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చి ఉండి ఉంటే, ఎన్నికల ఫలితాలు మరోలా ఉండేవేమో? కానీ సుప్రీంకోర్టు తీర్పు వెలువడేసరికి మూడు ముఖ్యమైన రాష్ట్రాలు బిజెపి చేజారిపోయి కాంగ్రెస్ హస్తగతం అయిపోయాయి. ఇప్పుడు ఇక చేసేదేమీ లేదు కనుక ఈ తీర్పును బిజెపి లోక్ సభ ఎన్నికలలో ఉపయోగించుకొని తన నిజాయితీని చాటుకొనే ప్రయత్నం చేయవచ్చు.


Related Post