గెలిచి ఓడిన ఉత్తమ్

December 14, 2018


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘోరపరాజయం పాలవడంతో పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా ముందుకు రావడానికి ఇబ్బందిపడుతున్నారు. అందుకే డిసెంబరు 11న ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఆయన ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు. 

ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ నుంచి గెలిచినప్పటికీ కోదాడ నుంచి పోటీ చేసిన ఆయన అర్ధాంగి పద్మావతి అతితక్కువ ఓట్ల తేడాతో ఓడిపోవడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఓడిపోవడంతో ఆయన తన విజయాన్ని ఆస్వాదించలేకపోతున్నారు. ఆయన ఇబ్బందికి ఇంకా అనేక కారణాలు కూడా ఉన్నాయి. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే వరకు గడ్డం గీయనని చేసిన శపధం, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే మళ్ళీ గాంధీ భవన్‌ మెట్లు తొక్కనని, రాజకీయ సన్యాసం చేస్తానని చేసిన శపధాలు ఇప్పుడు ఆయనకు ఇబ్బందికరంగా మారాయని చెప్పవచ్చు. 

ఇక టికెట్ల పంపిణీపై కాంగ్రెస్‌ నేతల ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెప్పుకోవలసిరావచ్చు. గత ఐదేళ్ళుగా నియోజకవర్గాలలో తెరాస ఒత్తిళ్లను తట్టుకొంటూ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులను కాపాడుకొంటూ వచ్చిన  అనేకమంది సీనియర్ నేతలు ఈసారి ఎన్నికలలో పోటీ చేయాలని ఆశించారు. కానీ వారిని పక్కన పెట్టారు. ప్రజాకూటమి పొత్తులలో భాగంగా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్న స్థానాలను ఏమాత్రం బలం లేని మిత్రపక్షాల అభ్యర్ధులకు కేటాయించడం, ఆ కారణంగా ఊహించినట్లుగానే ఆ స్థానాలను తెరాస గెలుచుకోవడం వంటి నిర్ణయాలన్నిటికీ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుంది. పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేయవచ్చు. కానీ చేసిన శపధాలు ఆయనకు బందనాలుగా మారాయని చెప్పవచ్చు. ఒకవేళ వాటినన్నిటినీ గట్టున పెట్టి మళ్ళీ గాంధీ భవన్‌లో అడుగుపెట్టినా, ఆయనపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్‌ నేతలు కాకుల్లా పొడవకుండా విడిచిపెట్టరు. కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం చాలా ఇబ్బందికరమైన పరిస్థితినే ఎదుర్కొంటున్నారని చెప్పవచ్చు. కనుక ఈ ఎన్నికలలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలిచారో ఓడారో చెప్పలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.


Related Post