ప్రజాకూటమి ఓటమిపై సిపిఐ నారాయణ కామెంట్స్

December 13, 2018


img

ప్రజాకూటమి ఓటమిపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ స్పందిస్తూ, “తెరాస చెపుతున్నట్లుగా మేము కేవలం కేసీఆర్‌ను గద్దె దించడానికే ప్రజాకూటమి ఏర్పాటు చేయలేదు. కొన్ని దీర్గకాలిక లక్ష్యాలు, ప్రయోజనాలను సాధించడం కోసం ఏర్పాటు చేశాము. హామీల అమలులో ఘోరంగా విఫలమైన తెరాసను ప్రజలు తిరస్కరిస్తారని భావించాము. కానీ కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమపధకాలతో లబ్ధి పొందినవారు తెరాసవైపే మొగ్గు చూపుతారని గ్రహించలేకపోయాము. కనుక ఈ ఎన్నికలు..ఫలితాలు మాకు ఒక గుణపాఠం వంటివేనని భావిస్తున్నాము. 

ఇక మా ఓటమికి మావైపు నుంచి కూడా అనేక కారణాలు కనిపిస్తున్నాయి. నామినేషన్ల గడువు ముగిసేవరకు అభ్యర్ధులను ఖరారు చేసుకోలేకపోవడం, ఆ కారణంగా తెరాసకు ధీటుగా ఎన్నికల ప్రచారం చేసుకోలేకపోవడం, సిపిఐ, సిపిఎం పార్టీలు వేర్వేరు కూటముల తరపున పోటీ చేయడం వంటి కారణాలు కనిపిస్తున్నాయి. 

అన్నిటి కంటే ముఖ్యంగా ప్రజాకూటమిలో పార్టీల నేతల మద్య సానిహిత్యం ఏర్పడింది కానీ జిల్లా గ్రామస్థాయిలో నాలుగు పార్టీల నేతల మద్య, కార్యకర్తలమద్య దూరం అలాగే ఉండిపోయింది. ఆ కారణంగా ప్రజాకూటమి అభ్యర్ధులకు మిగిలిన మూడు పార్టీల నేతలు, కార్యకర్తల నుంచి పూర్తి సహకారం లభించకపోవడంతో పరాజయం పాలయ్యాము. అయితే ఈ లోపాలను ఇప్పుడు గుర్తించగలిగాము కనుక వాటినన్నిటినీ సవరించుకొని మళ్ళీ నాలుగు పార్టీలు కలిసికట్టుగా లోక్ సభ ఎన్నికలకు వెళ్ళినట్లయితే ఈసారి మంచి ఫలితాలు రావచ్చు,” అని అన్నారు. 

 ప్రజాకూటమి వైఫల్యానికి నారాయణ చెప్పిన కారణాలలో జిల్లా, గ్రామస్థాయిలో పార్టీల మద్య సఖ్యత ఏర్పడలేదనేది వాస్తవం. ప్రజాకూటమి గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే ‘వివాహ నిశ్చితార్ధం జరిగింది కానీ పెళ్ళి జరుగలేదని’ చెప్పవచ్చు. 

రాష్ట్ర స్థాయిలో నాలుగు పార్టీల అగ్రనేతల మద్య ఎటువంటి అవగాహన, బలమైన సంబంధాలు ఏర్పడ్డాయో గ్రామస్థాయిలో కూడా నాలుగు పార్టీల నేతలు, కార్యకర్తల మద్య అటువంటి అవగాహన, అంతే బలమైన సంబంధాలు ఏర్పడేందుకు తగినంత గడువు ఉండి ఉంటే ఆ నాలుగు పార్టీల ఓట్లు ప్రజాకూటమి అభ్యర్ధులకు బదిలీ అయ్యుండేవి. సత్తుపల్లి నుంచి పోటీ చేసిన టిడిపి అభ్యర్ధి సండ్ర వెంకట వీరయ్య, తన నియోజకవర్గంలో నాలుగు పార్టీల నేతలు, కార్యకర్తల మద్దతు కూడగట్టుకోగలిగినందునే తెరాస ప్రభంజనంలో కూడా విజయం సాధించగలిగారు. కనుక ఒకవేళ ప్రజాకూటమిని ఇంకా కొనసాగించదలిస్తే, గ్రామస్థాయి వరకు నాలుగు పార్టీలు ఒకటే పార్టీ అన్నట్లుగా అందరూ కలిసి పనిచేసేవిధంగా శిక్షణా కార్యక్రమాలు నిర్వహించుకొంటే పంచాయితీ, లోక్ సభ ఎన్నికలలో సత్ఫలితాలు సాధించే అవకాశం ఇంకా ఉంది.


Related Post