తెరాసలో చేరను కానీ...జగ్గారెడ్డి

December 13, 2018


img

ఈసారి ఎన్నికలలో తెరాస ప్రభంజనం తట్టుకొని నిలబడి గెలిచినవారిలో తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(జగ్గారెడ్డి) ఒకరు. నకిలీ పాసుపోర్టు, విదేశాలకు మనుషుల అక్రమరవాణా కేసులో ఎన్నికలకు ముందు జైలుకు కూడా వెళ్ళి వచ్చిన ఆయన సంగారెడ్డి నుంచి పోటీ చేసి గెలుపొందడం చాలా ఆశ్చర్యకరమే. ఒకవేళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండి ఉంటే ఆయన ఏవిధంగా ప్రతీకారం తీర్చుకొనేవారో తెలియదు కానీ మళ్ళీ తెరాస అధికారంలోకి రావడంతో ఆయన తీరే పూర్తిగా మారిపోయింది. 

ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నేను ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాను. తెరాసలో చేరను. నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తాను. సిఎం కేసీఆర్‌, జిల్లా మంత్రుల సహకారంతో సంగారెడ్డి నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తాను. అవసరమైతే కేసీఆర్‌ను 100 సార్లు కలిసైనా నియోజకవర్గం అభివృద్ధి చేసుకొంటాను. జిల్లాకు ఎవరు మంత్రిగా వచ్చినా వారి ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తాను. గతంలో తెలిసో తెలియాకో కొన్ని తప్పులు చేశాను. ఇకపై నావలన ఎటువంటి పొరపాట్లు జరుగకుండా జాగ్రత్త పడతాను. ఇకపై సిఎం కేసీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులపై ఎన్నడూ ఎటువంటి విమర్శలు చేయబోను,” అని చెప్పారు.

జగ్గారెడ్డి తెరాసలో చేరబోనని చెపుతూనే తెరాసకు అనుబంద సభ్యుడిగా పనిచేస్తానన్నట్లు మాట్లాడుతున్నారు. నిజానికి ప్రస్తుత పరిస్థితులలో మిగిలిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలందరి పరిస్థితి కూడా అదేనని చెప్పవచ్చు. కేసీఆర్‌ తన పరిపాలనకు రిఫరెండంగా ఈ ఎన్నికలకు వెళ్ళి తిరుగులేని మెజార్టీతో గెలుపొందడంతో ప్రతిపక్షపార్టీలలో ఎవరూ ఆయనను ఇదివరకులా ఎదిరించి గట్టిగా మాట్లాడలేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. గత నాలుగేళ్ళలో రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీలను బలహీనపరచడానికి కేసీఆర్‌ చేసిన ప్రయత్నాలకంటే ఈ ఎన్నికలలో కొట్టిన దెబ్బతోనే వాటిని  దాదాపు నిర్వీర్యం చేశారని చెప్పవచ్చు. కనుక ప్రతిపక్ష పార్టీలలో చాలామంది నేతలు జగ్గారెడ్డిని ఫాలో అయిపోక తప్పదేమో? 


Related Post