నిరుద్యోగ భృతి గురించి కేసీఆర్‌ ఏమ్మన్నారంటే...

December 12, 2018


img

కేసీఆర్‌ ఈరోజు తెరాస శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోబడిన తరువాత మీడియాతో పలు అంశాల గురించి మాట్లాడారు. నిరుద్యోగ భృతి గురించి విలేఖరి అడిగిన ప్రశ్నకు, “నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామనే మాటకు కట్టుబడి ఉన్నాము. అయితే ఇంకా వరుసగా ఎన్నికలు ఉన్నందున వచ్చే ఆర్ధిక సంవత్సరం (ఏప్రిల్ 1వ తేదీ) నుంచి దీనిని అమలుచేస్తాం. ముందుగా దీనికి విధివిధానాలు రూపొందించాల్సి ఉంటుంది. కనుక త్వరలోనే దీనికోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తాము. ఇతర రాష్ట్రాలలో ఎక్కడైనా ఇటువంటి పధకం అమలుచేస్తున్నట్లయితే అక్కడి నుంచి దానికి సంబందించిన సమాచారం సేకరించవలసి ఉంటుంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేయించి రాష్ట్రంలో ఎంతమంది నిరుద్యోగులున్నారో లెక్కలు తీయవలసి ఉంటుంది. నాకు తెలిసినంతవరకు రాష్ట్రంలో సుమారు 10 లక్షల వరకు నిరుద్యోగులున్నారు. వారందరికీ తప్పకుండా నిరుద్యోగభృతి కల్పిస్తాము. ఈ సమాచారం అంతా క్రోడీకరించుకొని, విధివిధానాలు రూపొందించుకొని ఈ పధకం అమలుకు తగినంత బడ్జెట్ కేటాయించుకోవలసి ఉంటుంది. దీనికంతటికీ కనీసం మూడు నాలుగు నెలలు పడుతుంది కనుక వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి ఈ పధకాన్ని తప్పకుండా  అమలుచేస్తాము,” అని కేసీఆర్‌ సమాధానం చెప్పారు. 

ఉద్యోగాల భర్తీపై అడిగిన ప్రశ్నకు సమాధానం చెపుతూ, “ఇకపై ఉద్యోగాల భర్తీ ప్రక్రియను వేగవంతం చేస్తాము. ప్రభుత్వ శాఖలలో ఖాళీలను భర్తీ చేయడమే కాకుండా ఐ‌టి తదితర ప్రైవేట్ రంగాలలో భారీగా ఉద్యోగాల కల్పనకు మరింత గట్టిగా కృషి చేస్తాము,” అని సమాధానం చెప్పారు. 

తెరాస ప్రభుత్వం నిరుద్యోగభృతి ఇవ్వబోతున్నప్పటికీ అందుకు రాష్ట్రంలో నిరుద్యోగులు కాంగ్రెస్ పార్టీకి కృతజ్ఞతలు చెప్పుకోక తప్పదు. ఎందుకంటే, కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో నెలకు రూ. 3,000 నిరుద్యోగభృతి చెల్లిస్తామని ప్రకటించినందునే, తెరాస కూడా హామీ ఇవ్వవలసి వచ్చింది. ఇప్పుడు తెరాస ప్రభుత్వం ఆ హామీని అమలుచేయడానికి సిద్దపడుతోంది. కనుక కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా రాష్ట్రంలో నిరుద్యోగయువతకు చాలా మేలు చేసింది. అందుకే ఆ పార్టీకి థాంక్స్ చెప్పుకోవాలి. 


Related Post