ఎన్నికల ఫలితాలపై విహెచ్ స్పందన

December 12, 2018


img

ఈసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తప్పకుండా గెలిచి అధికారంలోకి వస్తామని గట్టి నమ్మకంతో ఉన్న రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు, చాలా ఘోరంగా ఓటమిపాలవడంతో అందరూ మీడియాకు మొహం చాటేశారు. కానీ సీనియర్ కాంగ్రెస్‌ నేత వి.హనుమంతరావు మాత్రం మీడియా ముందుకు వచ్చి ఎన్నికల ఫలితాలపై తన అభిప్రాయం తెలియజేశారు. 

“ఈసారి ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజల నుంచి అనూహ్యస్పందన కనబడింది. కానీ ఓడిపోయామంటే నాకే నమ్మశక్యంగా లేదు. ఈవిఎమ్ లు ట్యాంపరింగ్ జరిగి ఉండవచ్చునని నాకు అనుమానం కలుగుతోంది. లేకుంటే డికె.అరుణ, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, షబ్బీర్ అలీ వంటి తప్పకుండా గెలవవలసిన నేతలు ఓడిపోవడం ఏమిటి? ఏది ఏమైనప్పటికీ ఇది ప్రజాతీర్పు కనుక దీనిని అందరూ తప్పక అంగీకరించవలసిందే,” అని అన్నారు.

“కాంగ్రెస్‌ ఓటమికి ఎవరు బాధ్యులు? చంద్రబాబునాయుడుతో దోస్తీ చేయడం వలననే కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలైందని భావిస్తున్నారా?” అని ప్రశ్నకు సమాధానంగా, “కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడానికే మేమందరం కలిసి పనిచేశాము. కనుక మాపార్టీ ఓటమికి కూడా మేమందరం సమానంగా బాధ్యత వహిస్తాము. టిడిపి, దాని అధినేత చంద్రబాబుతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం మా పార్టీ ఓటమికి కారణమని నేను భావించడం లేదు.  టిడిపితో చేతులు కలిపితే ఓడిపోతారనుకొంటే తెరాసలోనే టిడిపి నేతలు ఎక్కువమంది ఉన్నారు. కనుక తెరాస కూడా ఓడిపోయుండలి కదా? కానీ వారిని ప్రజలు గెలిపించారు కదా? కనుక ప్రజలు టిడిపితో మా దోస్తీని వ్యతిరేకిస్తున్నారని నేను భావించడం లేదు. ప్రజాకూటమిలో సీట్ల సర్దుబాట్లలో ఆలస్యం జరగడం, ఆ కారణంగా నామినేషన్ల గడువు దగ్గర పడే వరకు అభ్యర్ధుల పేర్లు ఖరారు చేయలేకపోవడం వంటివి మా పార్టీకి చాలా నష్టం కలిగించాయని నేను భావిస్తున్నాను. అయితే ఈ ఓటమికి బాధ్యత వహించి ఎవరో ఒకరు రాజీనామా చేయాలని నేను కోరను. కానీ దీనికి తామే భాద్యులమని అనుకొనేవారు రాజీనామా చేస్తే బాగుంటుంది. అయితే ఎవరో ఒకరు రాజీనామా చేయడం ముఖ్యం కాదు. ఈ ఓటమికి గల కారణాలపై జిల్లా స్థాయి వరకు పార్టీలో చర్చించుకొని, త్వరలో జరుగబోయే లోక్ సభ ఎన్నికలకు పార్టీ సిద్దం కావడమే మా తక్షణ కర్తవ్యమని నేను భావిస్తున్నాను,”అని వి.హనుమంతరావు అన్నారు.


Related Post