తెలంగాణలో అగ్రనేతలకు ఎదురుదెబ్బలు!!!

December 11, 2018


img

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెరాస విజయపధంలో దూసుకుపోతున్నప్పటికీ ఆ పార్టీలో మాజీ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, అజ్మీరా చందూలాల్‌ తమ ప్రత్యర్ధుల చేతిలో ఓడిపోయారు. 

ఇక కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు కె జానారెడ్డి (నాగార్జున్ సాగర్), కోమటిరెడ్డి వెంకటరెడ్డి (నల్గొండ), టి. జీవన్ రెడ్డి (జగిత్యాల), సర్వే సత్యనారాయణ (సికింద్రాబాద్‌ కంటోన్మెంట్), రేవంత్‌రెడ్డి (కొడంగల్‌), డికె.అరుణ (గద్వాల్), కొండా సురేఖ (పరకాల), అడ్లూరి లక్ష్మణ్ కుమార్ (ధర్మపురి), ఆదిశ్రీనివాస్ (వేములావాడ) ఓటమి పాలయ్యారు. 

బిజెపి ప్రముఖులలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్ (ముషీరాబాద్), కిషన్ రెడ్డి (అంబర్ పేట), ఆలె జితేంద్ర (మలక్ పేట), సిహెచ్ రామచంద్రారెడ్డి (ఖైరతాబాద్), రాజా సింగ్ (గోషా మహల్), సతీష్ గౌడ్ (సికింద్రాబాద్‌), ఎన్.రామచంద్ర రావు (మల్కాజ్ గిరీ), బద్దం బాల్ రెడ్డి (రాజేందర్ నగర్), ఎం. రఘునందన్ రావు (దుబ్బాక) వంటి హేమాహేమీలు అందరూ ఓటమి అంచున ఊగిసలాడుతున్నారు.           

ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్న టిడిపి అభ్యర్ధి సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి) గెలువబోతుండగా, అనూహ్యంగా చివరి నిమిషంలో కూకట్‌పల్లి నుంచి టిడిపి అభ్యర్ధిగా బరిలో దిగిన స్వర్గీయ నానడమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని ఓటమికి చేరువలో ఉన్నారు. 

ఇక ప్రజాకూటమిలో చివరి నిమిషం వరకు 14 స్థానాల కోసం పట్టుబట్టిన తెలంగాణ జనసమితిలో ఏ ఒక్క అభ్యర్ధి గెలిచే సూచనలు కనబడటం లేదు. అలాగే పట్టుబట్టి హుస్నాబాద్ టికెట్ సాధించుకొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి కూడా ఓటమికి దగ్గరలో ఉన్నారు.


Related Post