కేసీఆర్‌ పాలనపై ప్రజల తీర్పు రేపే!

December 10, 2018


img

నాలుగు బిజెపి పాలిత రాష్ట్రాలలో, తెరాస పాలిత తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకతమైనవని చెప్పవచ్చు. లోక్ సభ ఎన్నికలకు ముందు జరిగిన ఎన్నికలు కనుక వాటికి ఇవి సెమీ ఫైనల్స్ వంటివని భావించవచ్చు. వీటి ప్రభావం లోక్ సభ ఎన్నికలపై తప్పక ఉంటుంది కనుక నాలుగు బిజెపి పాలిత రాష్ట్రాలలో ఎన్నిటిని ఆ పార్టీ నిలబెట్టుకొంటుంది? ఎన్నిటిని కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకొంటుందని యావత్ దేశప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

చిరకాలంగా ఏ రాష్ట్రంలోనూ భారీ గెలుపుకు నోచుకోని కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలపై చాలా ఆశలు పెట్టుకొంది. అదేవిధంగా ఈ ఎన్నికలలో మళ్ళీ గెలిచి, దేశంలో మోడీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయనే కాంగ్రెస్‌ వాదనలను తిప్పికొట్టాలని బిజెపి ఆశపడుతోంది. అయితే రాజస్థాన్ లో కాంగ్రెస్ పార్టీకి, మధ్యప్రదేశ్ లో బిజెపికి పూర్తి విజయావకాశాలున్నాయని, ఛత్తీస్ ఘడ్, మిజోరాంలో వాటి మద్య పోటాపోటీ తప్పదని సర్వేలు జోస్యం చెప్పాయి. కనుక హంగ్ అవకాశమున్న ఆ రెండు రాష్ట్రాలలో ఆ రెండు పార్టీలు ప్రత్యర్ధ పార్టీల మద్దతు కూడ గట్టేందుకు తెర వెనుక జోరుగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. 

ఇక తెలంగాణ ఎన్నికల ప్రత్యేకతలు అందరికీ తెలిసినవే. ముందస్తు ఎన్నికలు, తెరాస పాలనకు రిఫరెండం కావడం, బద్దశత్రువులైన కాంగ్రెస్‌-టిడిపిలు చేయిచేయి కలిపి ప్రజాకూటమిని ఏర్పాటు చేయడం, మిగిలిన నాలుగు రాష్ట్రాల కంటే తెలంగాణలోనే అత్యధికంగా ఎన్నికల ఖర్చులు ఉండటం, అదే స్థాయిలో నగదు, మద్యం వగైరాలు పట్టుబడటం వంటివన్నీ చెప్పుకోవలసినవే. 

అయితే ముఖ్యంగా చెప్పుకోవలసినవి ముందస్తు ఎన్నికలు కావడం. తెరాస పాలనకు రిఫరెండం కావడం. ముందస్తు ఎన్నికలకు కేసీఆర్‌తో సహా ఎవరూ ప్రజలకు సంతృప్తికరమైన కారణం చెప్పలేకపోయారు. కానీ తెరాస పాలన గురించి గట్టిగానే చెప్పుకోగలిగారు. 

ఈ ఎన్నికలు తెరాస నాలుగేళ్ళ పాలనకు రిఫరెండం వంటివని, తమ ప్రభుత్వం నిజంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిందని, తాము అమలుచేసిన సంక్షేమ పధకాలు ప్రజలకు ఉపయోగపడ్డాయని భావిస్తేనే తెరాసను గెలిపించాలని లేకుంటే నిర్మొహమాటంగా డిపాజిట్లు కూడా రాకుండా ఓడగొట్టండని సిఎం కేసీఆర్‌ నిర్భయంగా చెప్పారు. దేశంలో ముఖ్యమంత్రులు, చివరికి దేశ ప్రధాని కూడా తాము చాలా గొప్పగా పరిపాలించమని, అభివృద్ధి చేశామని చెప్పుకొని ప్రజలను ఓట్లు అడుగుతారే తప్ప తమ పరిపాలన బాగోలేకపోతే తమను డిపాజిట్లు కూడా రాకుండా ఓడగొట్టమని నిర్భయంగా ప్రజలకు చెప్పగలవారెవరూ దేశంలో లేరనే చెప్పవచ్చు. కనుక కేసీఆర్‌ పాలనపై తెలంగాణ ప్రజల తీర్పు ఏవిధంగా ఉండబోతుందోనని యావత్ దేశప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు. ఈ పరీక్షలో కెసిఆర్ నెగ్గినట్లయితే దేశ చరిత్రలో ఇదొక గొప్ప ముఖ్యమంత్రిగా నిలిచిపోతారు. 


Related Post