రేపు ఉదయం 8 నుంచి కౌంటింగ్ షురూ

December 10, 2018


img

తెలంగాణతో సహా మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్, మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు సాయంత్రంలోగా వెలువడబోతున్నాయి. ఐదు రాష్ట్రాలలో ఉదయం 8గంటలకు ఓట్ల లెక్కింపు మొదలు పెట్టి ఎప్పటికప్పుడు పార్టీల ఆధిక్యతలను, గెలుపోటములను ప్రకటిస్తుంటారు. తెలంగాణలో మొత్తం 43 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వాటిలో 13, హైదరాబాద్‌లో, మిగిలినవి జిల్లాకు ఒకటి చొప్పున ఏర్పాటు చేశారు.   

మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కించి ఆ వివరాలు ప్రకటిస్తారు. అనంతరం ఈవిఎంలలో నిక్షిప్తమైన ఓట్ల లెక్కలు తీసి వరుసగా ప్రకటిస్తారు. ఒక్కో కేంద్రంలో కౌంటింగ్ కోసం 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. కనుక ఒక్కో రౌండులో 14 ఈవిఎంల ఫలితాలు వెలువడుతుంటాయి. కౌంటింగ్ పూర్తయిన తరువాత అభ్యర్ధులు లేదా వారి ఏజంట్ల సమక్షంలో వివిఫ్యాట్ లో ముద్రించబడిన రసీదులను లెక్కించి, ఈవీఎంలతో సరిపోల్చి చూసి, అంతా సక్రమంగానే ఉందని దృవీకరించుకొంటారు. కౌంటింగ్ ప్రక్రియ ముగిసేవరకు కౌంటింగ్ కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో కర్ఫ్యూ అమలులో ఉంటుంది కనుక ఇతరులు ఎవరూ అటువైపు వెళ్ళేందుకు అనుమతించరు. రేపు మధ్యాహ్నం ఒంటి గంటలోపే ఎన్నికల ఫలితాలపై చాలా వరకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 


Related Post