మెజార్టీ లభిస్తే కేటిఆర్‌ ముఖ్యమంత్రి?

December 10, 2018


img

ఈసారి ఎన్నికలలో తెరాసకు 100కు పైగా సీట్లు సాధించడం ఖాయమని సిఎం కేసీఆర్‌ మొదటి నుంచి గట్టిగా వాదిస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ తెరాస 100కు పైగా సీట్లు సాధించగలిగితే, ఈసారి కేసీఆర్‌కు బదులు ఆయన కుమారుడు కేటిఆర్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. ఇందుకు కొన్ని బలమైన కారణాలే కనిపిస్తున్నాయి.

ముందుగా గ్రేటర్ ఎన్నికలను మనం ఓసారి గుర్తు చేసుకోవలసి ఉంది. ఒకప్పుడు గ్రేటర్ పరిధిలో తెరాస 10-20 సీట్లు కూడా గెలుచుకొనే పరిస్థితి ఉండేది కాదు. కారణాలు అందరికీ తెలిసినవే. కానీ గ్రేటర్ ఎన్నికలకు రెండేళ్ల ముందు నుంచి సిఎం కేసీఆర్‌ అనేక ‘సన్నాహాలు’ చేసి, ‘తెరాస ఖచ్చితంగా 100 సీట్లు గెలుస్తుందని పూర్తి నమ్మకం కలిగిన తరువాతనే గ్రేటర్ ఎన్నికలలో ‘తెరాసను గెలిపించే బాధ్యత’ కేటిఆర్‌ ఒక్కరికే అప్పగించారు. అప్పుడు ఊహించినట్లుగానే కేటిఆర్‌ విజృంభించి తెరాసను అవలీలగా గెలిపించి ‘నాన్నకు ప్రేమతో...’ గ్రేటర్ విజయాన్ని బహుమతిగా అందించారు. అప్పుడు సిఎం కేసీఆర్‌ కూడా పుత్రోత్సాహాసంతో కేటిఆర్‌ను కౌగలించుకొని ఫోటోలు దిగి ‘కొడుకుకు ప్రేమతో...’డబుల్ ప్రమోషన్స్ ఇవ్వడం అందరూ చూశారు. అప్పుడు గ్రేటర్ అయితే ఇప్పుడు తెలంగాణ ఎన్నికలు అంతే తేడా. మిగిలిందంతా సేమ్ టూ సేమ్ అని చెప్పవచ్చు.   

ఆనాటి నుంచి కేటిఆర్‌ అటు ప్రభుత్వంలో, ఇటు పార్టీలో కేటిఆర్‌ తిరుగులేని నాయకుడిగా ఎదిగేందుకు కేసీఆర్‌ చేయని ప్రయత్నం లేదు. మెట్రో రైలు ప్రారంభోత్సవం క్రెడిట్ కేసీఆర్‌ స్వంతం చేసుకొనే అవకాశం ఉన్నప్పటికీ, తాను వెనక్కు తగ్గి కేటిఆర్‌కు ముందుంచడం ద్వారా అది కొడుకుకు దక్కేలా చేయగలిగారు. మెట్రోలో ప్రధాని నరేంద్రమోడీ పక్కన కేటిఆర్‌ కూర్చోవడం యాదృచ్ఛికంగా జరిగింది కాదు. తద్వారా కేటిఆర్‌కు జాతీయస్థాయిలో కూడా మంచి గుర్తింపు వచ్చేలా చేయడం కోసమే కేసీఆర్‌ ఆవిధంగా చేశారని చెప్పవచ్చు. 

ఆ తరువాత కేటిఆర్‌ తన నాయకత్వ లక్షణాలను, ప్రభుత్వ పనితీరుపై అవగాహనను నిరూపించుకొంటూ దూసుకుపోతుండటం అందరూ కళ్ళారా చూస్తూనే ఉన్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎవరితోనైనా ఏ అంశంపైనైనా సాధికారికంగా చర్చించగల తిరుగులేని నాయకుడిగా, గొప్ప కార్యదక్షుడిగా కేటిఆర్‌ ఎదిగారు. 

అంటే ఈ నాలుగేళ్ళలో కేసీఆర్‌ తన కుమారుడు కేటిఆర్‌ను అన్నివిధాలా శిక్షణ ఇచ్చి ముఖ్యమంత్రి పదవికి సిద్దం చేశారని అర్ధమవుతోంది. కేటిఆర్‌ అందుకు అన్నివిధాల అర్హుడని అందరూ అంగీకరిస్తారు కూడా. 

కనుక కేటిఆర్‌ తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది. కానీ తెరాస 100కు పైగా సీట్లు గెలుచుకొని పూర్తి మెజార్టీతో ప్రభుత్వం ఏర్పాటు చేసేస్థితిలో ఉంటేనే కేటిఆర్‌ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయించవచ్చు. ఒకవేళ 100 సీట్లు వచ్చినప్పటికీ ఏ కారణం చేతైనా ఇప్పుడు కేటిఆర్‌ ముఖ్యమంత్రి పదవి చేపట్టాక పోయినప్పటికీ లోక్ సభ ఎన్నికలలోగా అంటే 2019 మార్చి, ఏప్రిల్ నెలలలోగా ముఖ్యమంత్రి పదవి చేపట్టవచ్చు. 

ఒకవేళ తెరాసకు 60-65 సీట్లు వచ్చినా లేదా అంతకంటే తక్కువ వచ్చి మజ్లీస్, బిజెపి స్వతంత్ర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేయవలసి వస్తే, మళ్ళీ కేసీఆరే ముఖ్యమంత్రి పదవి చేపడతారు. అభివృద్ధి కోసం మరోసారి ‘రాజకీయ పునరేకీకరణ’ కార్యక్రమాలు ముగిసి తెరాస బలం 90-100కు చేరిన తరువాత, ప్రభుత్వానికి మరెవరి నుంచి సవాళ్ళు లేదా ఇబ్బందులు ఉండవని నిర్ధారించుకొన్న తరువాత కేటిఆర్‌కు ముఖ్యమంత్రి కుర్చీ అప్పజెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఒకవేళ తెరాస మళ్ళీ అధికారంలోకి వస్తే రేపటి నుంచి వచ్చే ఎన్నికలలోగా కేటిఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కావడం తద్యం. అది ఎప్పుడనేది తెరాస ప్రభుత్వం నిలదొక్కుకోవడాన్ని బట్టి ఉంటుంది.


Related Post