గవర్నరు పాత్ర కీలకం కానుందా?

December 10, 2018


img

ఒకవేళ రేపు ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత రాష్ట్రంలో హంగ్ అసెంబ్లీ ఏర్పడినట్లయితే అప్పుడు గవర్నరు నరసింహన్ వైఖరి, ఆయన తీసుకోబోయే నిర్ణయాలే తెరాస, ప్రజాకూటమిల భవిష్యత్తును నిర్దేశిస్తాయని అందరికీ తెలుసు. 

అదే పరిస్థితి ఏర్పడితే కేసీఆర్‌తో ఆయనకున్న సాన్నిహిత్యం, అదేవిధంగా మోడీతో కేసీఆర్‌కున్న సాన్నిహిత్యం నేపద్యంలో ఆయన ఏవిధంగా వ్యవహరిస్తారో తేలికగానే ఊహించుకోవచ్చు. ఇది ముందే ఊహించిన ప్రజాకూటమి నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదండరామ్‌, ఎల్ రమణ, చాడా వెంకట్ రెడ్డి తదితరులు సోమవారం ఉదయం రాజ్ భవన్ వెళ్ళి గవర్నరు నరసింహన్ ను కలువబోతున్నారు. ఈ ఎన్నికలలో తమ నాలుగు పార్టీలు కలిసి పోటీ చేసాయి కనుక తమను ఒకటే జట్టుగా పరిగణించి నిర్ణయం తీసుకోవాలని వారు ఆయనను కోరనున్నారు. 

అయితే, గత నాలుగున్నరేళ్ళలో ఏనాడూ ప్రతిపక్ష పార్టీల వినతులను పట్టించుకోని గవర్నరు నరసింహన్, ప్రజాకూటమి చేసే ఈ వినతిని పట్టించుకొంటారనుకోవడం అత్యాసే అవుతుందని చెప్పవచ్చు. ఆయన కేంద్రప్రభుత్వ ప్రతినిధి కనుక దాని సూచనల మేరకే నడుచుకొనే అవకాశాలే ఉంటాయని వేరే చెప్పనవసరం లేదు. 

అదీగాక రేపు వెలువడబోయే ఫలితాలలో రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికారంలోకి వచ్చే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నందున, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కల్పించినట్లయితే, దేశంలో కాంగ్రెస్‌ అనుకూల పవనాలు వీస్తున్నాయని...దేశప్రజలలో బిజెపి పట్ల వ్యతిరేకత పెరిగిందనే బలమైన సంకేతాలు ప్రజలలోకి వెళతాయి. అదీగాక ఒకవేళ తెలంగాణలో ప్రజాకూటమి (కాంగ్రెస్ పార్టీ) అధికారంలోకి వచ్చినట్లయితే, లోక్ సభ ఎన్నికల నాటికి అది మరింత బలపడి బిజెపిని దెబ్బ తీయవచ్చు. తెలంగాణలో ప్రజాకూటమి ప్రభుత్వం ఏర్పడితే, ఈ ప్రయోగం ఫలించింది కనుక దేశవ్యాప్తంగా బిజెపిని వ్యతిరేకిస్తున్న అన్ని పార్టీలు కాంగ్రెస్‌ నేతృత్వంలో ఏర్పాటు అవుతున్న మహాకూటమిలో చేరేందుకు ముందుకు వస్తాయి. అప్పుడు ఒక్క తెలంగాణలోనే కాక దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలలో బిజెపి ఎదురీదవలసి వస్తుంది. 

అదే... తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ తెరాస ప్రభుత్వం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సహకరించినట్లయితే, ప్రత్యుపకారంగా లోక్ సభ ఎన్నికలలో తెరాస మద్దతు కోరవచ్చు. కనుక తెరాస కోసం కాకపోయినా బిజెపి తన స్వీయరాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణలో ప్రజాకూటమి (కాంగ్రెస్‌) అధికారంలోకి రాకుండా గవర్నరు ద్వారా అడ్డుకొనే అవకాశం ఉందని భావించవచ్చు. కనుక ప్రజాకూటమికి స్పష్టమైన మెజార్టీ రాకపోతే అది ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా కావచ్చు. 


Related Post