హైకోర్టు జోక్యం చేసుకొంటే ఎలా ఉంటుందో చూశారు గనుక...

December 06, 2018


img

ఐదేళ్ళకోసారి రావలసిన ఎన్నికలు అకారణంగా చాలా ముందుగా వచ్చేశాయి. ఎందుకొచ్చాయో చర్చించుకొనే సమయం కాదిది. ఏమి చేయాలో ఆలోచించుకోవలసిన సమయం ఇది. ఎక్కడైనా ఎప్పుడైనా ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరగాలని ప్రజలు కోరుకొంటారు. జరుపుతున్నామని ఎన్నికల సంఘం, పోలీస్ శాఖ, ఆపద్ధర్మ ప్రభుత్వం చెపుతుంటాయి. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి విరుద్దంగా ఉన్నాయని ప్రజలతో సహా అధికారులందరికీ తెలుసు. ఒత్తిళ్ళ కారణంగా అధికారులు తమ కర్తవ్యాన్ని కాసేపు పక్కన పెట్టి వ్యవహరిస్తుంటారు. అలా వ్యవహరించినప్పుడు న్యాయస్థానం కలుగజేసుకొంటే ఏమవుతుందో తెలుసుకోవడానికి రేవంత్‌రెడ్డి అరెస్టు వ్యవహారంపై హైకోర్టు స్పందన కళ్లెదుటే ఉంది. 

ఇక గత రెండున్నర నెలలుగా చేస్తున్న ఎన్నికల ప్రచారంతో ఓటర్లను మెప్పించలేకపోవచ్చు కానీ కీలకమైన ఈ 24 గంటలలో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి మెప్పించవచ్చనే ధీమా అధికార, ప్రతిపక్షపార్టీలలో బలంగా ఉంది కనుకనే ప్రలోభాలపర్వం మొదలైంది. అందుకు నిదర్శనంగా రాష్ట్రంలో ఎక్కడికక్కడ జరుగుతున్న మందువిందు పార్టీలు, భారీగా పట్టుబడుతున్న నగదు, చీరలు, క్రికెట్ కిట్స్, ఇతర వస్తువులు అనేకం కనిపిస్తున్నాయి. అయినప్పటికీ ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా జరపడానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశామని ఎన్నికల సంఘం, పోలీస్ శాఖ చెపుతోంది అంటే అర్ధం ఏమిటి? కనుక ఇప్పటికైనా పోలీస్, రిటర్నింగ్ అధికారుల వైఖరిలో మార్పు వస్తే అధికార, ప్రతిపక్షపార్టీల ఈ ప్రలోభాలకు కళ్ళెం వేయవచ్చు. రేపు సజావుగా పోలింగ్ ప్రక్రియ ముగించవచ్చు. ఎంతైనా వారు కూడా ఈ రాష్ట్రంలో  పౌరులే కదా? వారు కూడా ఓటర్లే కదా? కనుక వారు కూడా తమ కర్తవ్యాన్ని సక్రమంగా  నిర్వర్తించవలసిన బాధ్యత ఉంటుంది.   

రాష్ట్రంలో 4 కోట్లకు పైగా జనాభా ఉంది. కానీ 2,80,64,684 మంది మాత్రమే ఓటర్లున్నారు. వారు రేపు వేయబోయే ఓట్లు మిగిలిన కోటి మందికి పైగా ఉన్న ప్రజల జీవితలను కూడా ప్రభావితం చేస్తుంది. కనుక అన్ని విధాలా సమర్దుడైన అభ్యర్ధినే ఎన్నుకోవాలి.    

చివరిగా ఒక మాట: అధికారం కోసం తహతహలాడే రాజకీయ నాయకులు తరచూ ప్రజలకు ఒక మాట చెపుతుంటారు....చైతన్యం కావాలని! ఇప్పుడు నిజంగానే ఆ సమయం వచ్చింది. పార్టీలు, వ్యవస్థలు ఏవిధంగా పనిచేస్తున్నప్పటికీ ఓటర్లు సరైన నిర్ణయం తీసుకొని సరైన వ్యక్తులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవాలి. తద్వారా ఓటర్లు నిజంగా చైతన్యమైతే ఏమవుతుందో రాజకీయ నాయకులకు చూపవచ్చు.


Related Post