డీజీపీకి హైకోర్టు అక్షింతలు

December 06, 2018


img

కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కొడంగల్‌ అభ్యర్ధి రేవంత్‌రెడ్డి అరెస్టు విషయంలో ఎన్నికల సంఘం, పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహానికి డీజీపీ మహేందర్‌రెడ్డి హైకోర్టు చేత అక్షింతలు వేయించుకోవలసివచ్చింది. రేవంత్‌రెడ్డి అరెస్టును సవాలు చేస్తూ దాఖలైన పిటిషనుపై విచారించిన హైకోర్టు ధర్మాసనం మొదట దీనిపై ప్రభుత్వం తరపు వాదించిన ప్రభుత్వ అటార్నీ జనరల్ కు అక్షింతలు వేసింది. ఆయన వాదనలతో సంతృప్తి చెందని ధర్మాసనం డీజీపీ మహేందర్‌రెడ్డి స్వయంగా కోర్టుకు హాజరయ్యి సంజాయిషీ ఇవ్వాలని కోరిందంటే ఈ వ్యవహారంలో హైకోర్టు ఎంత ఆగ్రహంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

నిన్న జరిగిన విచారణలో కూడా డీజీపీ మహేందర్‌రెడ్డిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిఘావర్గాల సంతకాలు, అధికారిక ముద్రలు, తేదీలు లేకుండా పంపిన నివేదికను హైకోర్టు కొట్టిపడేసింది. అది తమను మభ్య పెట్టేందుకే అప్పటికప్పుడు సృష్టించి తెచ్చినట్లుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాలపై ఎన్నికల సంఘం ప్రధానాధికారి లేదా ముఖ్య అధికారుల సంతకాలు, అధికారిక ముద్రలు, తేదీలు లేనప్పుడు దానిని ఏవిధంగా పరిగణనలోకి తీసుకొన్నారని హైకోర్టు ప్రశ్నించింది. 

రేవంత్‌రెడ్డి వలన సమస్య ఉందనుకొంటే, ముందుగా ఆయనతో మాట్లాడి ఎందుకు హెచ్చరించలేదని ప్రశ్నించింది. అసలు ప్రతిపక్ష పార్టీల ప్రధాన నాయకులలో ఒకడైన ఆయనను అంతా హడావుడిగా రాత్రిపూట అరెస్ట్ చేయవలసిన అవసరం ఏమిటని ప్రశ్నించింది. అసలు ఇదంతా ఎవరి ఆదేశాలతో చేశారో చెప్పాలని హైకోర్టు డీజీపీ మహేందర్‌రెడ్డిని గట్టిగా నిలదీసింది. ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసులు వ్యవహరించవలసిన తీరు ఇదేనా? అని ప్రశ్నించింది. ప్రభుత్వ అటార్నీ జనరల్, డీజీపీ మహేందర్‌రెడ్డిల సమాధానాలతో సంతృప్తి చెందని హైకోర్టు దీనిపై 13వ తేదీలోగా కౌంటరు దాఖలు చేయాలని ఆదేశిస్తూ ఈ కేసును డిసెంబరు 17కు వాయిదా వేసింది. 


Related Post