తెరాస గురించి మజ్లీస్ ఏమనుకొంటోందో...కేసీఆర్‌ కూడా..

December 05, 2018


img

తెరాస, మజ్లీస్ పార్టీలు మేము మిత్రులమని నేటికీ గట్టిగా చెప్పుకొంటున్నాయి. చెప్పుకోవడమే కాదు... రెండు పార్టీలు ఎన్నికల ప్రచార సభలలో పరస్పరం సహకరించుకొంటున్నాయి...మద్దతు ఇచ్చుకొంటున్నాయి కూడా. కానీ “రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా మాకు సలాం కొట్టవలసిందే. ఏ పార్టీ అధికారంలోకి రావాలి... ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలనే విషయం మేమే నిర్ణయిస్తాము. ప్రభుత్వం ఎవరిదైనా అధికారం మా చేతుల్లోనే ఉంటుంది. అవకాశం వస్తే నేనే ముఖ్యమంత్రి అవుతాను,” అని అక్బరుద్దీన్ ఓవైసీ తన ఎన్నికల ప్రచార సభలలో పదేపదే గట్టిగా నొక్కి చెపుతున్నారు.  అంటే తెరాస చెప్పుకొంటున్నట్లుగా దానికి 100 సీట్లు రావని, ప్రజాకూటమి, తెరాసలలో దేనికీ పూర్తి మెజారిటీ రాదని కనుక ప్రభుత్వ ఏర్పాటుకు తప్పనిసరిగా అవి మద్దతు కోసం తమ వద్ద చేతులు చాచవలసిందేనని దానార్ధం.  

వాటిని మజ్లీస్ అధినేత అస్దుద్దీన్ ఓవైసీ ఖండించడం లేదంటే అది మజ్లీస్ పార్టీ ఆలోచనగానే భావించవచ్చు.  లగడపాటి సర్వే చేసి 10 మంది స్వతంత్ర అభ్యర్ధులు గెలువబోతున్నారంటే ఆయనపై నిప్పులు చెరుగుతున్న కేసీఆర్‌, కేటిఆర్‌, తెరాస నేతలు, తమ మిత్రపక్షమని చెప్పుకొంటున్న మజ్లీస్ పార్టీ ఈవిధంగా ప్రచారం చేస్తుంటే కనీసం స్పందించకపోవడం విచిత్రంగా ఉంది. అంటే ఓవైసీ చెపుతున్నట్లుగా ఎన్నికల తరువాత మజ్లీస్ అవసరం పడవచ్చుననే ఆలోచనతోనే తెరాస మౌనం వహిస్తోందా? అనే సందేహం కలుగుతోంది. 

తెలంగాణ ప్రభుత్వం గురించి మజ్లీస్ ఆశలు, ఆలోచనలు ఏవిధంగా సాగుతున్నాయో, అలాగే కేంద్రం గురించి సిఎం కేసీఆర్‌ ఆశలు, ఆలోచనలు సాగుతున్నట్లున్నాయి. తనకు 19 మంది ఎంపిలను ఇచ్చినట్లయితే కేంద్రంలో చక్రం తిప్పుతానని, కేంద్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా వారి మెడలు వంచి మనకు కావలసినవన్నీ సాధిస్తానని చెప్పుతున్నారు. అంటే వచ్చే ఏడాది మార్చి-ఏప్రిల్ నెలలలో జరుగబోయే లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్‌, బీజేపీ కూటములలో దేనికీ పూర్తి మెజారిటీ రాదని, అప్పుడు వాటికి తెరాస మద్దతు అనివార్యమని, వాటికి మద్దతు ఇచ్చి, కేంద్ర ప్రభుత్వాన్ని శాసించవచ్చునని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నట్లున్నారు. అంటే తన పార్టీ-ప్రభుత్వం గురించి మజ్లీస్ ఏవిధంగా ఆలోచిస్తోందో, కేంద్రం గురించి కూడా కేసీఆర్‌ అదేవిధంగా ఆలోచనలు చేస్తున్నట్లు భావించవచ్చు. 


Related Post