ఇద్దరు కాదు ముగ్గురు... పక్కా! రేవంత్‌రెడ్డి

November 20, 2018


img

తెరాస చేవెళ్ళ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మంగళవారం సాయంత్రం తెరాస పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, తన ఎంపీ పదవికి కూడా రాజీనామా చేయడంపై తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి స్పందించారు. “నేను ఈ విషయం చెప్పినప్పుడు తెరాస నేతలు కొట్టిపారేశారు. కానీ నా మాటలు నిజమని ఇవాళ్ళ తేలింది. అయితే మొదట చెప్పినట్లుగా తెరాస నుంచి ఇద్దరు కాదు... మొత్తం ముగ్గురు ఎంపీలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇది కూడా త్వరలోనే అందరూ చూస్తారు,” అని అన్నారు. 

రేవంత్‌రెడ్డి మొదట ఈ ప్రకటన చేసినప్పుడు తెరాస ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి, అజ్మీరా సీతారాంనాయక్‌ (మహబూబాబాద్‌) ఇద్దరూ దానిని గట్టిగా ఖండించారు. రేవంత్‌రెడ్డి తమతో మైండ్ గేమ్స్ ఆడుతున్నారని ఆరోపించారు. కానీ ఆ మాటలు అన్న రెండు రోజులకే వారిలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి రాజీనామా చేశారు. కనుక తరువాత అజ్మీరా సీతారాంనాయక్‌ కూడా తెరాసకు రాజీనామా చేస్తారో లేదో తెలియదు కానీ రేవంత్‌రెడ్డి తాజాగా మరో ఎంపీ కూడా తెరాసను వీడబోతున్నారంటూ చేసిన ప్రకటన తెరాసలో గుబులు పుట్టిస్తోంది. రేవంత్‌రెడ్డి ఈసారి నిజంగానే మైండ్ గేమ్ ఆడుతున్నారా లేదా ఆయన చెప్పినట్లు మరో ఎంపీ కూడా తెరాసకు గుడ్ బై చెప్పబోతున్నారా? అదే నిజమైతే ఇంతకీ ఆ మూడో ఎంపీ ఎవరు? అనే ప్రశ్నలకు బహుశః త్వరలోనే జవాబులు లభిస్తాయేమో? 


Related Post