ఆ విషయంలో బిఎల్ఎఫ్ బెస్ట్

November 20, 2018


img

రాష్ట్రంలో ప్రధాన రాజకీయపార్టీలన్నీ బడుగు బలహీన, మైనార్టీలకు తామే పెద్ద దిక్కు అన్నట్లు మాట్లాడుతుంటాయి. కేవలం తాము మాత్రమే ఆ వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నామని గట్టిగా బల్ల గుద్ది మరీ వాదిస్తుంటాయి. కానీ టికెట్ల కేటాయింపులకొచ్చేసరికి జనాభాలో స్వల్ప శాతం ఉండే అగ్రకులాల అభ్యర్ధులకే ఎక్కువ సీట్లు కేటాయిస్తుంటాయి. జనాభాలో అధికశాతం ఉన్న బీసీలకు వారికి రిజర్వ్ చేయబడిన నియోజకవర్గాలలో మాత్రమే సీట్లు కేటాయించి అదే చాలా గొప్ప విషయం అన్నట్లు మాట్లాడుతుంటాయి. 

అగ్రవర్ణాల అభ్యర్ధులతో పోలిస్తే బీసీ అభ్యర్ధులు ఆర్ధికంగా బలంగా లేకపోవడం, ఆ కారణంగా రాజకీయంగా బలహీనంగా ఉండటమే కారణాలని చెప్పవచ్చు. కనుక ఈసారి కూడా కాంగ్రెస్‌, తెరాస, బిజెపిలు అదే చేశాయి. మహాకూటమి-22, తెరాస- 25, బీజేపీ-23 సీట్లు మాత్రమే బీసీలకు కేటాయించాయి. 

కానీ బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ (బిఎల్ఎఫ్) మాత్రం బీసీలకు-60, ఎస్సీలకు-28, ఎస్టీలకు-15, ముస్లింలకు-10, ఓసీలకు-6 సీట్లు కేటాయించి తన మాట నిలుపుకొంది. వారిలో ఒక ట్రాన్స్ జండర్ (నపుంసక) అభ్యర్ధి చంద్రముఖికి (గోషామహల్) టికెట్ కేటాయించింది. 

బిఎల్ఎఫ్ అభ్యర్ధులలో బీసీలలో ముదిరాజ్‌- 4, గౌడ-7, యాదవ- 7, మున్నూరుకాపు-9, పద్మశాలి-7, పెరిక-1, కురుమ-4, రజక-3, విశ్వబ్రాహ్మణ-4, నాయీబ్రాహ్మణ-1, లింగాయత్‌-1, వడ్డెర-4, బెస్త-1, కుమ్మరి-1, మేరు-1, ఆరెకటిక-1, మేదరి-1, పూసల-2, నాయుడు-1 సీట్లు కేటాయించింది.  

ఎస్సీలలో మాదిగ-14, మాల-13, నేతకాని-1 స్థానాలను కేటాయించింది.  

ఎస్టీలలో కోయ-5, లంబాడ-7, గోండు-1, నాయక్‌పోడు-1, ఎరుకల-1 స్థానాలను కేటాయించింది.  

అగ్రవర్ణాలలో బ్రాహ్మణ-1, కమ్మ-1, రెడ్డి-3, వెలమ-1 బ్రాహ్మణ-1, కమ్మ-1 స్థానాలను కేటాయించింది. 

బిఎల్ఎఫ్ ముస్లింలకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తూ వారికి 10 స్థానాలు కేటాయించింది. ఒకవేళ బిఎల్ఎఫ్ ఈ ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినట్లయితే బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేస్తామని  ముందే ప్రకటించింది. 

గమ్మతైన విషయం ఏమిటంటే, బీసీల సంక్షేమం కోసం దశాబ్ధాలుగా పోరాడుతున్న ఆర్.కృష్ణయ్య, రాష్ట్రంలో రాజకీయ పార్టీలు బీసీలకు జనాభా ప్రతిపదికన సీట్లు కేటాయించనందుకు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాక అందుకు నిరసనగా ఈనెల 17వ తేదీన రాష్ట్ర బంద్ చేస్తామని ప్రకటించారు. కానీ ముందే ఊహించినట్లుగా ఆయన కాంగ్రెస్ పార్టీతో మాట్లాడుకొని మిర్యాలగూడ టికెట్ సంపాదించుకొని తన దారి తాను చూసుకొన్నారు. కనుక బిఎల్ఎఫ్ మాత్రమే బీసీ, ఎస్సీ,ఎస్టీ, మైనార్టీల పట్ల తన చిత్తశుద్దిని నిరూపించుకొందని చెప్పవచ్చు.

ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు చిన్న హీరో సినిమాను జనాలు ఏవిధంగా పట్టించుకోరో అలాగే అంగబలం, అర్ధబలం ఉన్న నాలుగు ప్రధాన రాజకీయ పార్టీలు బరిలో దిగి పోటీ పడుతున్నప్పుడు ఓటర్లు వాటివైపే మొగ్గు చూపుతారు. కనుక టికెట్ల కేటాయింపులోనే సామాజిక న్యాయం అమలుచేసి చూపుతున్న బిఎల్ఎఫ్ ను పట్టించుకొంటారా?ఏమో!


Related Post