కాంగ్రెస్‌ మాకు హ్యాండ్ ఇచ్చింది: కోదండరామ్‌

November 20, 2018


img

తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్‌ కాంగ్రెస్ పార్టీపై సున్నితంగా విమర్శలు గుప్పించారు. మంగళవారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “పొత్తులలో భాగంగా మాకు 8 సీట్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది కానీ 6 సీట్లే ఇచ్చింది. మేము బీసీ అభ్యర్ధికి (పొన్నాల లక్ష్మయ్య) అన్యాయం జరుగకూడదనే ఉద్దేశ్యంతో జనగామ సీటును వదులుకొన్నాము. కానీ కాంగ్రెస్ పార్టీ మాకు మాట మాత్రంగానైనా చెప్పకుండా మాకు కేటాయించిన మిర్యాలగూడలో ఆర్.కృష్ణయ్యను తమ అభ్యర్ధిగా బరిలో దించింది. ఆయనకు అక్కడి నుంచి టికెట్ కేటాయించబోతున్నట్లు మాకు తెలియనే తెలియదు. ఇటువంటి స్నేహపూర్వకపోటీలను విరమించుకోవాలని కాంగ్రెస్ పార్టీని మేము కోరుతున్నాము. దీనిపై ఆ పార్టీ నేతలతో చర్చిస్తున్నాము. మాకు కేటాయించిన స్థానాలలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్ధులను ఉపసంహరించుకొంటుందనే భావిస్తున్నాను,” అని అన్నారు. 

మహాకూటమి గురించి మాట్లాడుతూ, “ఇక నుంచి కాంగ్రెస్ పార్టీ పెద్దన్న పాత్రను సరిగ్గా పోషించాలని కోరుకొంటున్నాము. మహాకూటమి ఏర్పాటు చేయడం ద్వారా రాష్ట్రంలో తెరాసకు ఒక బలమైన ప్రత్యామ్నాయం  ప్రజలకు అందుబాటులోకి తేగలిగాము. త్వరలో జరుగబోయే కాంగ్రెస్‌ బహిరంగసభలలో నేను కూడా పాల్గొంటాను,” అని కోదండరామ్‌ చెప్పారు.


Related Post