ఒకేరోజు కేసీఆర్‌ 4 బహిరంగసభలు

November 20, 2018


img

సోమవారం పాలకుర్తి, ఖమ్మంలో వరుసగా రెండు బహిరంగసభలలో పాల్గొని రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించిన సిఎం కేసీఆర్‌ ఇవాళ్ళ ఒకేరోజు వరుసగా నాలుగు బహిరంగసభలలో పాల్గొనబోతున్నారు.

మొదట మధ్యాహ్నం 2.30 గంటలకు సిద్ధిపేటలో బహిరంగసభలో పాల్గొంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో హుజూరాబాద్ చేరుకొని అక్కడ బహిరంగసభలో పాల్గొంటారు. మళ్ళీ అక్కడి నుంచి సాయంత్రం 4.30 గంటలకు సిరిసిల్లలో జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. చివరిగా యెల్లారెడ్డిలో బహిరంగసభలో పాల్గొంటారు.

సిఎం కెసిఆర్ తన ప్రసంగంలో గత నాలుగేళ్ళలో తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరిస్తూనే, గత 58 ఏళ్ళుగా సమైక్య రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్‌, టిడిపిలు ఎందుకు  ఈ కార్యక్రమాలను చేపట్టలేకపోయాయని ప్రశ్నిస్తున్నారు.తద్వారా ప్రజలను కూడా ఆలోచింపజేసే ప్రయత్నం చేస్తున్నారు.

“మా నాలుగేళ్ళ పాలనలో మేము చేసిన అభివృద్ధి, చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు నిజమని ప్రజలు నమ్ముతున్నట్లయితేనే తెరాసను భారీ మెజార్టీతో గెలిపించాలని లేకుంటే డిపాజిట్లు రాకుండా ఓడగొట్టాలని” సిఎం కేసీఆర్‌ చేస్తున్న సవాలును దేశంలో మరే ముఖ్యమంత్రి చేయలేరనే చెప్పవచ్చు. 

మహాకూటమిని చంద్రబాబు నాయుడుతో ముడిపెట్టి తిట్టి పోసినదానికంటే, కేసీఆర్‌ నోట రాష్ట్రంలో జరిగిన, జరుగుతున్న, ఇక ముందు జరుగబోయే అభివృద్ధి పనుల గురించి వింటున్నప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. కనుక మిగిలిన తెరాస నేతలు కూడా అభివృద్ధి, సంక్షేమ పధకాల గురించే ఎక్కువగా మాట్లాడితే మంచిది.


Related Post