పార్టీలు కాదు...టికెట్లే ముఖ్యం!

November 20, 2018


img

ఎన్నికలు లేనప్పుడు రాజకీయ నాయకులు తమ పార్టీల గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. కానీ ఎన్నికలప్పుడు టికెట్ లభించకపోతే ఏమాత్రం సందేహించకుండా పార్టీలు మారుతుంటారు. ఇది చాలా సర్వ సాధారణమైన విషయమే. అయితే ఈసారి ఎన్నికలలో అటువంటివారు చాలామందే ఉన్నారు. 

మొదట చెప్పుకోవలసిన వ్యక్తి తెరాస మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ. తెరాస మొదటి జాబితాలో ఆమెకు టికెట్ లభించకపోవడంతో వెంటనే కాంగ్రెస్ పార్టీలో చేరి పరకాల నుంచి టికెట్ సంపాదించుకొన్నారు. అంతేకాదు... తనకు టికెట్ ఇవ్వకుండా అవమానించినందుకు, ఉమ్మడి వరంగల్ జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో తెరాసను ఓడగొడతానని ప్రతిజ్ఞ కూడా చేశారు. తెరాసకే చెందిన మరో మాజీ ఎమ్మెల్యేలు బాబు మోహన్, బొడిగే శోభ ఇద్దరికీ టికెట్లు లభించకపోవడంతో ఇద్దరూ బిజెపిలో చేరిపోయి టికెట్  సంపాదించుకొని మళ్ళీ ఆంధోల్, చొప్పదండి నియోజకవర్గాల నుంచే పోటీకి సిద్దపడ్డారు. తెరాసకు చెందిన రాజేశ్వర రావు దేశపాండేకు ఈసారి కూడా టికెట్ లభించకపోవడంతో బిజెపిలో చేరి సంగారెడ్డి టికెట్ సంపాదించుకొన్నారు. అదేవిధంగా కేఎస్ రత్నం తెరాసలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేసి చేవెళ్ళ టికెట్ సంపాదించుకొన్నారు. అలాగే రమేశ్ రాథోడ్ ఆఖరు నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఖానాపూర్ టికెట్ దక్కించుకొన్నారు. ఇక మధిరకు చెందిన రాంబాబుకు తెరాస టికెట్ లభించకపోవడంతో బిఎల్పిలో చేరి టికెట్ సంపాదించుకొన్నారు.           

గత ఎన్నికలలో టిడిపి అభ్యర్ధిగా రాజేందర్ నగర్ నుంచి పోటీ చేసి గెలిచిన బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ఈసారి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మిర్యాలగూడ నుంచి టికెట్ సంపాదించుకొన్నారు. అలాగే టిడిపి నేత మల్లయ్య యాదవ్ టికెట్ లభించకపోవడంతో తెరాసలోకి జంప్ చేసి కోదాడ టికెట్ సాధించుకొన్నారు.            

మిగిలిన పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీలో కాస్త స్వేచ్చా స్వాతంత్రాలు కాస్త ఎక్కువే. అలాగే టికెట్లు కోసం పోటీ పడేవారి సంఖ్యా కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. కానీ ఈసారి మహాకూటమిలో పొత్తులలో భాగంగా 25 సీట్లు మిత్రపక్షలకు సమర్పించుకోవలసి రావడంతో టికెట్లు దక్కనికొందరు ఇతర పార్టీలలోకి దూకేసి టికెట్లు సంపాదించుకొన్నారు. 

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన అరుణతార వెంకట్ బిజెపిలో చేరి జుక్కల్, కోరుట్ల సీట్లు సంపాదించుకోగా, యడవల్లి కృష్ణ బిఎల్పిలో చేరి కొత్తగూడెం టికెట్ సంపాదించుకొన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో టికెట్ రాకపోవడంతో బోడ జనార్ధన్ రెడ్డి బిఎల్పీ కండువా కప్పుకొని చెన్నూరు టికెట్ తీసుకొన్నారు.


Related Post