సూటిగా...సుత్తి లేకుండా కేసీఆర్‌ స్పీచ్

November 19, 2018


img

నామినేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ప్రతిపక్ష పార్టీలు నేటి నుంచి ఎన్నికల ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టాయి. కనుక సిఎం కేసీఆర్‌ కూడా నేటి నుంచి కధనరంగంలో దిగి పాలకుర్తిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో తనదైన శైలిలో కాంగ్రెస్‌ నేతలపై చంద్రబాబు నాయుడుపై ప్రశ్నలు, విమర్శల వర్షం కురిపించి ప్రజలను ఆలోచింపజేశారు. ఆయన ప్రసంగంలో ముఖ్యాంశాలు క్లుప్తంగా...

1. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం చేయలేని విధంగా మా ప్రభుత్వం 411 సంక్షేమ పధకాలు అమలు చేస్తోంది. వాటిని అమలుజరుగుతున్న మాట నిజమో కాదో మీరే ఊర్లలో కూర్చొని చర్చించుకోండి. ఒకవేళ నేను చెపుతున్నది అబద్దమైతే మాకు డిపాజిట్లు కూడా రాకుండా ఓడగొట్టండి. నిజమనుకొంటే మహాకూటమికి డిపాజిట్లు రాకుండా ఓడగొట్టండి. 

2. అసలు కాంగ్రెస్‌, టిడిపిలకు ఇటువంటి పధకాలు అమలుచేయాలని ఎందుకు ఆలోచన రాలేదు అంటే వారిలో మానవీయకోణం లేనందునే. ఐక్యరాజ్యసమితి కూడా మన రైతుబందు పధకాన్ని మెచ్చుకొంది కానీ మన కాంగ్రెస్‌ నేతలకు దాని గొప్పదనం కనబడటం లేదు.     

3. ఖమ్మం జిల్లాలో 150 కిమీ పొడవునా గోదావరినది ప్రవహిస్తుంటే, 58 ఏళ్ళు పాలించిన కాంగ్రెస్‌, టిడిపి ప్రభుత్వాలు ఖమ్మం జిల్లాకు నీళ్ళు ఇవ్వకుండా ఎందుకు ఎండబెట్టాయో ఆ పార్టీ నేతలను మీరే నిలదీసి అడగండి. 

4. ఖమ్మం జిల్లాకోసం మా ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు మొదలుపెడితే చంద్రబాబు నాయుడు దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. అందుకు సాక్ష్యంగా ఆయన కేంద్రానికి వ్రాసిన ఈ లేఖ ప్రతులను మీడియా మిత్రులు అందరికీ ఇస్తున్నాను. తెలంగాణ బిడ్డలుగా మీరు కూడా దీని గురించి విశ్లేషణ చేస్తూ కధనాలు ప్రచురించాలి. 

5. మన వేళ్ళతోనే మన కళ్ళను పొడిచేందుకు ప్రయత్నిస్తున్న చంద్రబాబు నాయుడును, టిడిపి అభ్యర్ధులను మనం ఎందుకు ఓట్లు వేయాలి?అని అందరూ ఆలోచించాలి.  

6. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం ఆలస్యమైన మాట నిజం కానీ వాటి పనులు నిలిపివేయలేదు. మరో ఆరు నెలలలో 2.70 లక్షల ఇళ్ళు అందించబోతున్నాము. కనీసం రెండు తరాలకు ఆ ఇళ్ళు ఉపయోగపడేలా బలంగా నిర్మిస్తున్నాము. మేము నిర్మిస్తున్న ఒక్కో ఇల్లు కాంగ్రెస్ పార్టీ కట్టించిన 7 ఇళ్ళకు సమానం. ఆ లెక్కన 19 లక్షల ఇళ్ళు కట్టిస్తున్నట్లు లెక్క. కనుక ఓ ఆరు నెలలు ఆలస్యమైనంత మాత్రన్న నష్టం ఏమీ లేదు. 

7. మన రాష్ట్రంలో అంగన్ వాడీ, ఆశా వర్కర్లు, కాంట్రాక్ట్ కార్మికులు, హోమ్ గార్డులు తదితరులు దేశంలో అందరి కంటే ఎక్కువ జీతాలు అందుకొంటున్నారు. 

8. మన దేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ అందిస్తున్నాము. మన రాష్ట్రంలో మాత్రమే రైతుబందు, రైతుభీమా పధకాలు అమలుచేస్తున్నాము.  

9. దేశంలో తెలంగాణ, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు మాత్రమే శరవేగంగా వృద్ధి సాధిస్తున్నాయి. గత నాలుగేళ్లుగా తెలంగాణ రాష్ట్రం 17.17 వృద్ధి రేటు సాధిస్తూ దేశంలో నెంబర్: 1 రాష్ట్రంగా నిలుస్తోంది. గుజరాత్, మహారాష్ట్ర వంటి అభివృద్ధి చెందిన రాష్ట్రాల కంటే మనం చాలా ముందున్నాము. ఇవన్నీ చూసి కేసీఆర్‌ ఏమైనా మాయగాడా? మంత్రగాడా? అని అడుగుతున్నారు. కానీ చిత్తశుద్ధి, సంకల్పబలం ఉన్నందునే ఇవన్నీ సాధ్యం అవుతున్నాయి. కాంగ్రెస్‌, టిడిపి నేతలకు అవి లేకపోవడం వలననే ఇన్నేళ్ళుగా తెలంగాణ ఈ దుస్థితిలో ఉండిపోయింది.       

10. రాష్ట్రంలో పెరిగిన ఆదాయాన్ని వివిద సంక్షేమ పధకాల ద్వారా పేదల కోసమే ఖర్చు చేస్తున్నాము.  

11. నరేంద్ర మోడీ ఏదో చేస్తారనుకొంటే ఆయన కూడా చతికిలపడిపోయాడు. కాంగ్రెస్‌, బిజెపిలు రెండూ కూడా అన్నివిధాలా వైఫల్యం చెందాయి. అవి ఈ దేశానికి పనికిరావు. కనుక వాటికి ప్రత్యామ్నాయం అవసరం. డిల్లీలో చక్రం తిప్పుతానని నేను చెప్పను గానీ దేశరాజకీయాలను నియంత్రించే ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి గట్టిగా కృషి చేస్తాను. 

12. పోడు, అసైన్డ్ భూముల విషయంలో అనేక సమస్యలున్నాయి. ఈసారి ఆ సమస్యలన్నిటికీ శాస్విత పరిష్కారం చూపిస్తాను.


Related Post